ETV Bharat / city

RAINS IN TELANGANA: మబ్బులకు రంధ్రం పడినట్లు రాష్ట్రంలో కుంభవృష్టి

మబ్బులకు రంధ్రం పడినట్లు రాష్ట్రంలో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానలకు పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కాలనీలు వరద ముంపునకు గురయ్యాయి. హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి తదితర జిల్లాల్లో వాగులు పొంగుతుండటంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్‌, హనుమకొండ నగరాల్లో పలు కాలనీలు నీట మునిగాయి. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

RAINS IN TELANGANA
RAINS IN TELANGANA
author img

By

Published : Sep 7, 2021, 4:57 AM IST

Updated : Sep 7, 2021, 5:32 AM IST

రాష్ట్రంలో కుంభవృష్టి

వరంగల్​ జిల్లాపై వరుణుడు ప్రతాపం చూపించాడు. దంచికొట్టిన వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. హనుమకొండ జిల్లా ఆత్మకూర్మండలంలో కటాక్షాపూర్వంతెన పైనుంచి వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రామప్పకు వెళ్లే దారి ఇదే కాగా... వాహనదార్లకు ఇక్కట్లు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా దొరవారి తిమ్మాపురంలో వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు... శివారులోని వాగులో చిక్కుకున్నారు. స్థానికులు చేరుకుని తాడు సాయంతో 12 మందిని వాగు దాటించారు. గార్ల మండలంలో పాకాల చెక్​ డ్యామ్​ పైనుంచి వరద ఉప్పొంగడంతో రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బయ్యారం మండలం తిమ్మాపురంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పెసరబండ ప్రభుత్వ పాఠశాల జలదిగ్బంధమైంది. బడిలోకి పూర్తిగా నీరు చేరడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. గీసుకొండ మండలం కొనాయమాకుల గ్రామంలో పాఠశాల చెరువులా మారింది. హనుమకొండ జిల్లా పసరగొండలో బడి నుంచి ఇంటికి వస్తున్న విద్యార్థులు వరదనీటిలో చిక్కుకుని కొట్టుకుపోతూ పొదల్లో చిక్కుకున్నారు. స్థానికులు అప్రమత్తమై తాళ్ల సాయంతో పిల్లలను రక్షించారు.

పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష..

నర్సంపేట నియోజకవర్గంలో చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. నాచినపల్లిలో రోడ్డు దాటుతున్న ఓ యువకుడు... బతుకమ్మ చెరువు మత్తడి ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. నర్సంపేటలో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వరంగల్లో జోరు వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. హనుమకొండలో రోడ్లపై మోకాళ్లలోతు వరదనీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. సంగెం మండలంలో వరదనీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని స్థానికులు కాపాడారు. పళ్లారుగూడ-మొండ్రాయి గ్రామాల మధ్య వరదలో రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన ద్విచక్రవాహనదారుడు... బైక్​తో సహా కొట్టుకుపోతుండగా... స్థానికులు రక్షించారు. భారీ వర్షాల పట్ల వరంగల్ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ప్రజలకు సూచించారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుండపోత..

ఉమ్మడి ఖమ్మం జిల్లాను కుండపోత వానలు వణికించాయి. కొత్తగూడెం జిల్లాలో ఎడతెరపి లేకుండా వాన దంచికొట్టింది. కొత్తగూడెం, పాల్వంచ, మధిర, బోనకల్లు, ఏర్రుపాలెం, వైరా, ఎన్కూరు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇల్లందులో బుగ్గవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో జనజీవనం స్తంభించింది. నియోజకవర్గం వ్యాప్తంగా అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సత్యనారాయణపురంతో పాటు పలు వార్డులకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి అశ్వాపురం మండలంలోని ఇసుకవాగు, లోతువాగులు ఉరకలెత్తుతూ ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రోడ్లు కోతలకు గురయ్యాయి. సుమారు 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మణుగూరు బొగ్గుగనుల్లో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో చాలా చోట్ల పంటలు నీటమునిగాయి. పలుచోట్ల రహదారులపై వరదనీరు ప్రవహిస్తోంది.

రాత్రంతా నిద్రలేకుండా గడిపాం..

అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి మెదక్​ పట్టణంలోని గాంధీనగర్​ వీధిలోని ఇళ్లలోకి నీరు చేరింది. ఫలితంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాత్రంతా నిద్రలేకుండా గడిపామని.. ఇళ్లలోని వస్తువులన్నీ తడిచిపోయాయని.. మరికొన్ని వస్తువులు నీళ్లలో కొట్టుకుపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న డీఎస్పీ.. నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు. ఫైర్​ ఇంజిన్​ సాయంతో ఈ నీటిని తొలగించే పనులు చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న పురపాలక ఛైర్మన్​ చంద్రపాల్​.. ఇళ్లను పరిశీలించారు. బాధితులకు నిత్యావసర సరకులను అందించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని.. బాధితులకు డబుల్​ బెడ్​రూం ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

చినుకులతో మొదలై.. కుంభవృష్టి..

కరీంనగర్​లో ఆదివారం కురిసిన భారీ వర్షానికి... విద్యానగర్, రాంనగర్, కరీంనగర్, జ్యోతి నగర్, ముకరంపుర, శ్రీనగర కాలనీల్లోని ప్రధాన రహదారులు నీటమునిగాయి. శాతవాహన యూనివర్సిటీ రోడ్డులో సెయింట్ జాన్స్ పాఠశాల ఎదురుగా ఉన్న ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరింది. ఫలితంగా అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. భగత్​నగర్​, కట్ట రాంపూర్​ వీధులు జలమయమయ్యాయి. సిరిసిల్ల రోడ్డులోని పద్మానగర్​, రాంనగర్​ ప్రధాన రహదారిపై నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. స్మార్ట్ సిటీ పనులు అసంపూర్తిగా వదిలేయడం, మురుగునీటి కాలువలు అనుసంధానం చేయకపోవడం వల్ల వల్లే సమస్యలు తలెత్తినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

లోతట్టు ప్రాంతాల్లో మేయర్​ పర్యటన..

కరీంనగర్ నగర పాలక మేయర్ సునీల్​రావు, కమిషనర్ అగర్వాల్ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడం వల్ల మురుగు కాలువలు పొంగి.. రోడ్లపైకి నీరు చేరిందని సునీల్​రావు అన్నారు.

ఎగువనున్న ప్రాజెక్టుల నుంచి నీటిని విడిచిపెట్టడం వల్ల పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజ్​ నిండుకుండను తలపిస్తోంది. 1,01,555 క్యూసెక్కుల నీపు బ్యారేజ్​లోకి వచ్చి చేరుతోంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగానే దిగువకు వదిలేస్తున్నారు. పార్వతి బ్యారేజ్ పూర్తిస్థాయి నీటిమట్టం 8.83 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.250 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఆగస్టు 26 నుంచి నిరంతరాయంగా బ్యారేజ్ గేట్లను విడతలవారీగా ఎత్తుతూ.. 74 గేట్లకుగాను గత పదిరోజులుగా 60 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలి పెడుతున్నారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలతో పాటు మంథని నియోజకవర్గంలో గోదావరి నదిపై నిర్మించిన లక్ష్మి, అన్నారం బ్యారేజ్​ల నుంచీ నీటిని విడుదల చేస్తుండడం వల్ల గోదావరి తీరాన ఉన్న పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసులు సూచించారు.

  • మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌, మేడిపల్లి, రామంతాపూర్‌, ఘట్‌కేసర్‌, బోడుప్పల్‌, పిర్జాదిగూడ, పోచారం తదితర ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడిన కాలనీల్లోకి ప్రజలు వర్షాకాలం అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. కనీస మౌలిక సదుపాయాలు లేక చిన్న చిన్న వర్షాలకే రోడ్లు ఛిద్రమై.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వచ్చిందంచే చాలు మురుగు నీరంతా తమ కాలనీల్లోనే నిల్వ ఉండిపోతోందని వాపోతున్నారు. కొన్ని కాలనీల్లోకి వరద నీరు చేరడం వల్ల ఇళ్లకు తాళం వేసి బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు.

ఎందుకీ దుస్థితి..

మూసీ కాలువలను అనుకొని కొందరు లేఅవుట్లు రూపొందించారు. మరికొందరు మూసీ కాలువను కబ్జా చేసి అమ్మేశారు. దీంతో హైదరాబాద్‌ నగరం నుంచి వచ్చే వర్షం నీరు మూసీ కాలువ వెంట ప్రవహించకుండా కొత్తగా ఏర్పడ్డ కాలనీలోకి వచ్చి చేరుతోంది. కొత్త కాలనీల్లో సరైన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వచ్చిన నీరు కాలనీలోనే నిల్వ ఉండిపోతోంది. దీంతో ఆయా కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు.

  • భారీ వర్షాల కారణంగా మేడ్చల్ జిల్లా కాప్రా చెరువు పూర్తిగా నిండిపోయింది. నాళాలు పొంగిపొర్లుతూ.. ఇళ్లలోకి నీరు చేరుతున్నాయి. నాగారం ప్రధాన రహదారిపై గత వారం రోజుల నుంచి మోకాలు లోతు నీళ్లు నిల్వ ఉండిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాప్రా శివసాయి నగర్​లో గత నాలుగు రోజుల నుంచి కాలనీలోకి నీళ్లు వస్తుండడం వల్ల బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు.

ఎస్​ఆర్​ఎస్పీకి వరద..

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం 63 వేల క్యూసెక్కులకు పైగా నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 27 గేట్ల ద్వారా 1,24,840 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1090.5 అడుగుల నీటిమట్టం ఉంది. భారీ వర్షాల కారణంగా వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

కరెంటు పోతే ఫోన్‌ చేయండి: సీఎండీ

భారీ వర్షాలు కురుస్తున్నందున ఎక్కడైనా కరెంటు సరఫరాలో సమస్య తలెత్తితే వెంటనే ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని టీఎస్‌ ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి ప్రజలకు సూచించారు. ఇందుకోసం కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశామని, 7382072104, 7382072106, 7382071574 నంబర్లకు ఫోన్‌ చేయాలని కోరారు.

ఇవీ చూడండి: HYDERABAD RAINS: హైదరాబాద్​లో జోరువానలు.. నగరవాసులకు తప్పని ఇక్కట్లు

Last Updated : Sep 7, 2021, 5:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.