రాష్ట్రానికి భారీ పెట్టుబడి సమకూరినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ప్రముఖ కంపెనీ అమెజాన్.. తన వెబ్ సర్వీసెస్ ద్వారా రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి వస్తున్న అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని కేటీఆర్ తెలిపారు. రానున్న రోజుల్లో డాటా సెంటర్ల పెట్టుబడులకు తెలంగాణ ఆకర్షణీయ కేంద్రంగా మారే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
అతిపెద్ద పెట్టుబడి
తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడిని అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్లను... సుమారు 20,761 కోట్ల రూపాయలతో మూడు ప్రాంతాల్లో నిర్మించనున్నారు. ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీజియన్‌లో 3 అవైలబిలిటీ జోన్లు ఉంటాయి. ఈ జోన్లలో పెద్ద ఎత్తున డాటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది. ఇవన్నీ ఒకటే రీజియన్‌లో ఉన్నప్పటికీ... ప్రతీ డేటా సెంటర్ దేనికదే స్వతంత్రంగా పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది. తద్వారా ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ ఉంటుందని పేర్కొంది.
సంపూర్ణ సహకారం
రాష్ట్రంలో ఏర్పాటుకాబోతున్న డేటా సెంటర్ల ద్వారా డిజిటల్ ఎకానమీ, ఐటీ రంగం అనేక రెట్లు వృద్ధి చెందనుంది. డెవలపర్లు, ఐటీ కంపెనీలకు లాభం చేకూరనుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి తర్వాత అనేక కంపెనీలు తమ డాటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాంటి వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
దావోస్‌లో బీజం
అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడికి సంబంధించి ప్రాథమిక చర్చలను దావోస్ పర్యటనలో ప్రారంభించినట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రానికి అమెజాన్‌కి మధ్య ఉన్న బంధం మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: తెలంగాణలో జలాశయాల సామర్థ్యం 878 టీఎంసీలు..