తెలుగు లోగిళ్లన్నీ కొత్త కళను సంతరించుకుంటున్నాయి. శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పూల మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. పూలు, ఇతర పూజాసామగ్రి కోసం.. ప్రజలు మార్కెట్లకు క్యూ కడుతున్నారు. కొవిడ్ పరిస్థితులు, డిమాండ్ దృష్ట్యా.. పూల ధరలకు రెక్కలొచ్చాయి.
పూల ధరలకు రెక్కలు..
హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పూల మార్కెట్ ధరలు మండిపోతున్నాయి. బంతిపూలు కిలో రూ.80 -100, చేమంతిపూలు రూ.180-200, గులాబీ రూ.250-300, తురకబంతి రూ.200, మల్లెపూలు 200 గ్రాములు రూ. 200 నుంచి 250, గుమ్మడికాయ 50 రూపాయలు, అరటి, జామ పండ్లు డజను రూ.60, బంతిపూల దండ రూ. 200 చొప్పున పలుకుతున్నాయి. పూల ధరలు సహా ఇతర సామగ్రి వ్యయమెక్కువైనా.. వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించేందుకు.. అన్నీ కొనుగోలుచేస్తున్నట్లు భక్తులు చెబుతున్నారు.
లక్ష్మీ కటాక్షం కోసం..
మార్కెట్ పుల్ రష్‌గా ఉంది. రేట్లు ఎక్కువగా ఉన్నాయ్. సుమంగళిగా ఉండాలని.. లక్ష్మీ కటాక్షం కోసం పూజలు చేస్తాం. కరోనా పూర్తిగా తగ్గిపోవాలి.
-రత్న, గృహిణి, మెహిదీపట్నం, హైదరాబాద్
ఇది నా ఫేవరెట్ ఫెస్టివల్
శ్రావణమాసం, వరలక్ష్మి వ్రతం ముందురోజు వస్తే ధరలు తక్కువగా ఉంటాయనుకున్నాం. కానీ రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇది నా ఫేవరెట్ ఫెస్టివల్, ఎంత రేటున్నా.. అన్ని రకాల పూలు కొంటా.
-ప్రసన్న, గృహిణి, అత్తాపూర్, హైదరాబాద్
ఇదీ పండుగ విశిష్టత..
తెలుగు రాష్ట్రాల్లో శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా నిర్వహించడం హిందువుల ఆచారం. వరలక్ష్మి.. విష్ణుమూర్తి భార్య. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మిని ప్రజలు కొలుస్తారు. మంచి భర్త దొరకాలని, సంతానం కలగాలని ఆకాంక్షిస్తూ.. మహిళలు ఈ పూజను భక్తి శ్రద్ధలతో చేస్తారు. వీటితో పాటు వరలక్ష్మిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం. శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమనే నమ్మకంతో పూజల్లో పాల్గొంటారు. ఈ సంవత్సరం ఆగస్టు 9న మొదలైన శ్రావణ మాసం.. సెప్టెంబర్ 7న ముగుస్తుంది. శ్రావణ మాసం రావడంతోనే... తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం మొదలవుతుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో.. వరలక్ష్మిని ఎక్కువగా ఆరాధిస్తారు.
జనాలు ఎలాగైనా కొంటారనే..
పూలు, ఇతర సామగ్రి ధరలు ఆశాన్నంటుతున్నాయి. ఎలాగైనా జనాలు కొంటారని.. వ్యాపారులకు నచ్చినట్లు ధరలు పెంచేశారు.
- నరసింహాచార్యులు, పురోహితులు, మాసబ్‌ట్యాంక్, హైదరాబాద్
అమ్మవారి పూజకంటేనా..
అమ్మవారి పూజ కంటే డబ్బు చూసుకొనేది ఏముంటుంది.. అనే భావనతో కొంటున్నాం. సాధారణంగా పది రూపాయలున్న సరుకు నేడు వంద వరకూ పెంచి అమ్ముతున్నారు.
- రామానుజాచార్యులు, పురోహితులు, కూకట్పల్లి
పండుగల్లో వరలక్ష్మి వ్రతానికి అత్యంత ప్రాధాన్యత ఉన్న దృష్ట్యా... రైతులు ఈ సమయానికి తమ పూల ఉత్పత్తులను మార్కెట్‌కు తెచ్చేలా సాగు చేస్తారు. ఈసారి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున పూలు మార్కెట్‌కు రావడంతో.. స్థానిక రైతులు పండించిన వాటికి పెద్దగా డిమాండ్ లేకపోయింది. అయితే వినాయక చవితిపై ఆశలు పెట్టుకుంటున్నారు.
డిమాండ్ ఉంది గాని..
ఈ పండుగ వచ్చింది.. డిమాండ్ ఉంది గాని.. వర్షాలతో పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. దిగుబడి కూడా సరిగా లేదు. పెట్టుబడి ఎక్కువవుతోంది.
- మల్లేష్, పూల రైతు, బస్తీపూర్, రంగారెడ్డి జిల్లా
ఒకటి రెండు రోజులే..
మార్కెట్లో రష్బాగానే ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ఎక్కువగా పూలు వస్తున్నాయి. ఈ ఒకటి రెండు రోజులు రేట్లు ఎక్కువగా ఉంటాయి. తర్వాత మళ్లీ మామూలే.
- రాజేందర్‌రెడ్డి, పూల వ్యాపారి, మేడిపల్లి, రంగారెడ్డి జిల్లా
హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాల్లో పూల ఉత్పత్తులు కాస్త తగ్గినా.... మొహరం, వినాయక చవితి, రాఖీ వంటి పర్వదినాలపై.. వ్యాపారులు ధీమావ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఇటువంటి పర్వదినాల సమయంలోనే రెండు మూడు రోజుల ధరలు బాగుంటాయి.. లాభాలొస్తాయి.. ఆ తర్వాత పరిస్థితి నిరుత్సాహంగా ఉంటుందని రైతులు వాపోతున్నారు.
ఇదీచూడండి: తుపాకులతో తాలిబన్ల వీరంగం- అనేక మంది మృతి!