ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ దద్దరిల్లింది. మిలియన్ మార్చ్ పేరుతో నలభై సంఘాలతో కూడిన తహరీక్ ముస్లిం షబ్బాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనకు భారీగా నిరసనకారులు హాజరయ్యారు. నగరం నలుమూలల నుంచి ఎన్ఆర్సీ, సీఏఏని వ్యతిరేకిస్తున్న వారు ఆందోళనలో పాల్గొన్నారు. ఈనెల 28న నిర్వహించాలనుకున్నప్పటికీ... పోలీసులు అంగీకరించక పోవడంతో... హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆందోళనకారులు ధర్నా చౌక్‌కు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం లౌకిక వాద స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
నినాదాల హోరు..
ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్ ఆర్ సీ, ఎన్ పీఆర్ అమలు చేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాలని కోరారు. జాతీయ జెండాలు చేతపట్టుకొని పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దద్దరిల్లిన ధర్నాచౌక్ పరిసరాలు
సుమారు మూడు గంటల పాటు ఇందిరాపార్క్ ధర్నాచౌక్ పరిసరాలు నినాదాలతో దద్దరిల్లాయి. కేంద్ర ప్రభుత్వం ముస్లిం వ్యతిరేక చర్యలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు అజీజ్ పాషా, ఎంబీటీ అధ్యక్షుడు అమ్జదుల్లా ఖాన్, తెజస ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు, టీపీసీసీ అధికార ప్రతినిధి సయ్యద్ నిజమాముద్దీన్ తదితరులు సభకు హాజరై సంఘీభావం ప్రకటించారు. భారీ ప్రదర్శన, సభతో ఇందిరాపార్కు, ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభించి పోయింది.
ఇవీ చూడండి: 'ఇప్పుడు వ్యతిరేకించకుంటే.. రేపు మరొకరికి ఇదే దుస్థితి రావొచ్చు'