తెలంగాణ పోలీస్ శాఖ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని.. అందుకే సీఎం పోలీస్ శాఖకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. నగరంలోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ అంజనీకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. అధునాతన సౌకర్యాలతో కమాండ్ అండ్ కంట్రోల్ రూం నిర్మాణం జరుగుతోందన్నారు.
టెక్నాలజీని ఉపయోగించడంలో తెలంగాణ పోలీసులు ఇతర రాష్ట్రాల పోలీసుల కంటే ముందు వరుసలో ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కొనియాడారు. హైదరాబాద్‌లో నేరాల శాతం తగ్గిందని వివరించారు. పాతబస్తీలో ఒకప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని.. అందరూ మంచిగా ఉండాలని అనుకుంటున్నారని ఆయన వివరించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పారని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. పోలీస్ శాఖకు తగిన కేటాయింపులు చేస్తున్నారని వివరించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తర్వాత ఈ మార్పులు గమనించవచ్చని ఆయన స్పష్టం చేశారు. సీఎం ఆధ్వర్యంలో పోలీస్‌శాఖలో ఎన్నో మార్పులు తెచ్చామన్నారు. నేరాలు అరికట్టడం, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో ఆదర్శంగా నిలిచామని డీజీపీ తెలిపారు.
ఇదీ చదవండి: Tammineni: 'ఈటల.. భాజపా పంచన చేరటం సిగ్గుచేటు'