భారతదేశంలో దాతృత్వం, ధైర్యాన్ని కొదవలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కూకట్‌పల్లిలోని శ్రీ శ్రీ హోలిస్టిక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో... కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందజేసే కార్యక్రమాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తో కలిసి ప్రారంభించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో వైరస్ బాధితులకు ఉచితంగా వంద ఆక్సిజన్ కిట్లను మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా అందించారు.
ఆక్సిజన్ అవసరం ఉన్న కరోనా పేషేంట్లు హోలిస్టిక్ ఆసుపత్రి హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా పొందవచ్చునని మంత్రి స్పష్టం చేశారు. వ్యాధి తగ్గిన తర్వాత కిట్టును తిరిగి ఇవ్వాలని సూచించారు. వైరస్ సోకినా వారు భయపడకుండా ధైర్యంగా ఉంటే వ్యాధిని జయించడం సులభతరమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్ తీవ్రత కూడా తగ్గిందన్నారు.
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు మొట్టమొదటి మందు ధైర్యం. రెండో ఔషధం సాటి మనిషి చేయూత. భారత్‌లో దాతృత్వం, ధైర్యం, మానవత్వానికి కొదవలేదు. ఈటల రాజేందర్, వైద్యారోగ్యశాఖ మంత్రి
కరోనా లాక్డౌన్ సమయంలో హోలిస్టిక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేసిన సేవలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ కొనియాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వేల మందికి నిత్యావసర సరకులు అందచేశారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కార్పొరేటర్ జానకిరామరాజు, హోలిస్టిక్ ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనా పరీక్షల కోసం ఒత్తిడి.. ఆస్పత్రి ఆవరణలోనే ప్రసవం!