దేశ సంపదైన యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్లోని బిర్లా ప్లానిటోరియంలో ఇండో కెనడియన్ యూత్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన స్వామి వివేకానంద 158వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్ , ఏపీ ప్రభుత్వ సలహాదారుడు దేవులపల్లి అమర్ కూడా పాల్గొన్నారు.
స్వామి వివేకానంద చరిత్రను నేటి యువత చదవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని దత్తాత్రేయ అన్నారు. ఆపదలో సాటి మనిషికి సాయం చేయాల్సిన బాధ్యతను వివేకానందుడి స్పూర్తితో యువత అలవరచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2030 నాటికి భారతదేశ యువత నైపుణ్యం ప్రపంచానికి అవసరమవుతందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని భాజపా నేత లక్ష్మణ్ అన్నారు. స్వామి వివేకానంద స్పూర్తితో యువత ముందుకెళ్లాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవ చేస్తున్న పలువురికి... విశిష్ట పురస్కారాలు అందజేశారు.
ఇదీ చదవండి: రైతుల భవిష్యత్తును సీఎం కేసీఆర్ తాకట్టు పెట్టారు : భట్టి