భావకవిత్వం ప్రాచుర్యం సంతరించుకున్న రోజుల్లో అభ్యుదయ కవిత్వాన్ని ప్రోత్సహించిన మహా కవి దువ్వూరి రామిరెడ్డి అని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. హైదరాబాద్ అబిడ్స్‌లోని రెడ్డి హాస్టల్ రాజా రావుబహుదూర్ వెంకట్రామిరెడ్డి భవన్లో శ్రీమతి పొణాకా కనకమ్మ ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో... దువ్వూరి రామిరెడ్డి 125వ జయంతి సభ ఘనంగా జరిగింది. డా. వేమారెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దువ్వూరి రామిరెడ్డి రైతు పక్షపాతి అని... కర్షక వెతలను వివరిస్తూ రాసిన మహాకవిత్వ కృషీవలుడని దత్తాత్రేయ ప్రశంసించారు. బహుభాషా కోవిదునిగా సంప్రదాయ రీతులను మిళితం చేసి కొత్తతరానికి సాహితీ బాటలు వేసిన మహోన్నతమైన వ్యక్తిగా అభివర్ణించారు. పొణాకా కనకమ్మ గొప్ప స్వాతంత్ర్య సమరయోధురాలు అని... ఉద్యమంలో తన ఆస్తులను త్యాగం చేసిన మహానియురాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన బేటీ బచావో... బేటీ పడావో కార్యక్రమాన్ని వందేళ్ల క్రితమే ఆమె అమలు చేశారని... బాలికల చదువు కోసం కస్తూర్బా పాఠశాలలను స్థాపించారని పేర్కొన్నారు.స్త్రీల హక్కుల కోసం పోరాటంతో పాటు , స్వదేశీ ఉద్యమాన్ని ప్రోత్సహించారని తెలిపారు. వీరిరువురి జీవిత చరిత్రలను రెండు తెలుగు రాష్ట్రాలలో పాఠ్యంశాల్లో చేర్చి... భవిష్యత్ తరాలకు వారి చరిత్రను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇండియా బ్రాండ్‌తో తయారైన కరోనా వ్యాక్సిన్ ప్రపంచానికి స్ఫూర్తిగా ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శ్రీమతి పొణాకా కనకమ్మ ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన ప్రముఖులకు అవార్డు , నగదు పురస్కారంతో ఘనంగా సన్మానించారు.