Toll Charges at ORR : ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్)పై ఇవాళ్టి నుంచి పెరిగిన టోల్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. భాగ్యనగరం చుట్టూ 150 కి.మీ. పరిధిలో ఓఆర్‌ఆర్ విస్తరించి ఉంది. దీనిపై ప్రయాణించాలంటే తప్పకుండా టోలు చెల్లించాలి. వీటిని తాజాగా హెచ్‌ఎండీఏ పెంచింది. పెంచిన ఛార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. హెచ్‌ఎండీఏలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్.. 3.5 శాతం నుంచి 5 శాతం వరకు ఛార్జీలను పెంచింది. వాహనదారులకు కిలోమీటర్‌కు 7 పైసల నుంచి 53 పైసల వరకు భారం పడనుంది. టోల్‌ఛార్జీల పెంపుతో... నెలవారీ పాస్ చార్జీలు కూడా పెరిగాయి.
Toll Charges Hike at ORR : సేకరించిన సమాచారం ప్రకారం.. వాహనాల కేటగిరీ ఆధారంగా ప్రతి కిలోమీటర్‌కు రూ.2 నుంచి రూ.13 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. వసూలు బాధ్యతలను ఈగల్ అనే ప్రైవేటు సంస్థకు హెచ్‌ఎండీఏ కట్టబెట్టింది. 18 నెలలకు గాను రూ.630 కోట్లకు ఆ సంస్థ కోట్ చేసింది. రోజూ 1.30 లక్షల వాహనాలు ఓఆర్‌ఆర్‌పై రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ ఛార్జీల పెంపుతో ప్రతి నెలా 1.30 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరనుంది. మొత్తం 19 ఇంటర్ ఛేంజ్‌ల వద్ద టోల్ వసూలు చేస్తున్నారు.