పుప్పాలగూడ చెరువులో ప్రైడ్ హోండా అండ్ హైరేజస్ చేసిన ఆక్రమణలను తొలగించాలంటూ సామాజిక కార్యకర్త డాక్టర్ లుబ్నాసార్వవత్ రాసిన లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
నీటివనరుల ఆక్రమణలపై సహకరించడానికి న్యాయవాది కె.పవన్‌కుమార్‌ను అమికస్ క్యూరీ (కోర్టు సహాయకుడి)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలతో పుప్పాలగూడలోని చెరువు మాయమైందని పిటిషనర్ లేఖలో పేర్కొన్నారు. శంకర్‌నగర్ సమీపంలో గత ఆరేళ్లుగా మూసీ నదిని పూడ్చివేస్తున్నారని, కలుషితం చేస్తున్నారని తెలిపారు. ఆక్రమణలు ఉంటే తొలగించాలని, నిర్మాణాలు కొనసాగుతుంటే తక్షణం నిలిపివేయడానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. నివేదిక సమర్పించాలని ఏజీకి ఆదేశాలు జారీచేసింది. విచారణను జూన్ 26వ తేదీకి వాయిదా వేసింది.
కట్టమైసమ్మ చెరువు ఆక్రమణలపై..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారం గ్రామంలో కట్టమైసమ్మ చెరువు ఆక్రమణలపైనా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వంతోపాటు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ తదితరులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. విచారణను జూన్ 24కు వాయిదా వేసింది. చెరువు పూర్తిస్థాయి నీటిమట్టం ప్రాంతంలో హుడాతోపాటు పలువురు బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని న్యాయవాది ఎస్.మల్లేశ్వరరావు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఇవీ చూడండి: మిస్టరీ కేసైనా.. హిస్టరీతో సహా బయటపెట్టేశారు