రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడేనని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. జర్మనీ రాయబార కార్యాలయం ఇచ్చిన వివరణను కేంద్ర హోంశాఖ అదనపు అఫిడవిట్ రూపంలో ధర్మాసనానికి సమర్పించింది.
చెన్నమనేని 2009లో భారత పౌరసత్వం తీసుకున్నారని.. జర్మనీ పాస్‌పోర్టును 2013లో పునరుద్ధరించుకున్నారని కేంద్ర హోంశాఖ వివరించింది. జర్మనీలోని భారత రాయబార కార్యాలయం నుంచి 2019లో ఓవర్సీస్ సిటీజన్ ఆఫ్ ఇండియా కార్డు కూడా తీసుకున్నారని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్‌పై వాదించేందుకు గడువు కావాలని చెన్నమనేని తరఫు న్యాయవాది కోరడం వల్ల.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.