ఈ నెల 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉపాధ్యాయులకు కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే బడులు తెరవాలని.. పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇంకా వ్యాక్సినేషన్ పూర్తి కాలేదని పిటిషనర్ తెలుపగా.. 85 శాతం మందికి టీకాలు వేశామని ప్రభుత్వం తరఫు న్యాయవాది సమాధానమిచ్చారు. మిగతావారికీ వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. వాదనలు విన్న న్యాయస్థానం కేసు విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.
16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
ఈ నెల 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇప్పటికే స్పష్టం చేశారు. సాధారణ పనివేళల్లోనే పాఠశాలలు నడుస్తాయని మంత్రి వెల్లడించారు. పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలపై జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉపాధ్యాయులందరికీ దాదాపుగా వ్యాక్సినేషన్ పూర్తి చేశామని తెలిపారు. మిగిలిన వారికి కూడా టీకాలు వేయాలని ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఆన్‌లైన్ తరగతులు జరగట్లేదని.. ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఆన్‌లైన్ తరగతులు వద్దని ఆదేశించినట్లు తెలిపారు. ఈ నెల 16 నుంచి ఆఫ్‌లైన్‌లోనే పాఠశాలలను నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Dalitha bandhu: శాలపల్లిలో భారీ బహిరంగ సభ.. మొదటి రోజు 2వేల కుటుంబాలకు.!