Telangana High Court On Omicron : ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకలను నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వేడుకల్లో జనం గుమిగూడకుండా ఆంక్షలు విధిస్తూ రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కరోనా పరిస్థితులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతోందని... ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాలు, సంప్రదాయ వేడుకల్లో మాస్కులు ధరించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించడం లేదని రవిచందర్, చిక్కుడు ప్రభాకర్, పవన్ కుమార్ తదితర న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో పలు ఉత్సవాల్లో జనం భారీగా గుమిగూడే అవకాశం ఉందన్నారు.
Telangana High Court On Corona : స్పందించిన ధర్మాసనం వేడుకలను నియంత్రించాలని ఆదేశిస్తూ.. దిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయని ప్రస్తావించింది. ఇతర రాష్ట్రాల నుంచి ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా... సరిహద్దులు, రైల్వే స్టేషన్లు, ముఖ్యమైన బస్ స్టేషన్ల వద్ద స్క్రీనింగ్ పరీక్షలు జరపాలని స్పష్టం చేసింది. గత నెల 21న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను జనవరి 4కి వాయిదా వేసింది.
Omicron Cases Telangana Today : రాష్ట్రంలో మరో 14 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ఇటీవలే వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఈ కేసులతో రాష్ట్రంలో మొత్తం సంఖ్య 38కి చేరినట్లు వెల్లడించింది. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 12 మందిలో ఒమిక్రాన్ గుర్తించినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఆరుగురిలో ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. నాన్‌రిస్క్ దేశాల నుంచి వచ్చిన 31 మందిలో ఒమిక్రాన్ గుర్తించినట్లు వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. ఒకరికి కాంటాక్ట్ ద్వారా ఒమిక్రాన్ సోకినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Today Omicron Cases in Telangana : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 37,353 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 182 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,80,074కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 4,017కు చేరింది. కరోనా బారి నుంచి నిన్న 196 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,610 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Telangana Omicron Cases Latest : రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో హైకోర్టు విచారణ జరిపింది. రానున్న రోజుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలు వస్తున్నందున రాష్ట్ర సర్కార్ అప్రమత్తమై ప్రజలకు జాగ్రత్తలు చెప్పాలని ఆదేశించింది. ఆంక్షలు విధించి కరోనాను కట్టడి చేయాలని, ఒమిక్రాన్ కేసులు పెరగకుండా నిరయంత్రించాలని సూచించింది.