ఓడిపోయిన వారే ఎక్కువ పాఠాలు నేర్చుకుంటారని మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో హీరో రామ్ చరణ్ పాల్గొన్నారు. నిత్యం బిజీగా ఉండే పోలీసులకు క్రీడలు నిర్వహించడం ద్వారా మరింత ఉత్సహాం పెంపొందుతుందని రామ్‌చరణ్ తెలిపారు. పోలీసులంటే తనకు ప్రత్యేకమైన గౌరవమని... దృవ సినిమాలో ఐపీఎస్ అధికారిగా ఎలాంటి తప్పులు దొర్లకుండా నటించానన్నారు.
కొవిడ్ సమయంలో డాక్టర్ల తర్వాత ఎంతో నిబద్దతతో పోలీసులు కృషిచేశారని కొనియాడారు. వివిధ విభాగాల్లో విజేతలైన పోలీసులకు రామ్‌చరణ్ బహుమతులు అందించారు. పోలీసులు ఎంతో ఉత్సహంగా క్రీడల్లో పాల్గొన్నారని సీపీ సజ్జనార్ ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా పోలీసు సిబ్బంది ముందుకు వచ్చి క్రీడోత్సవాలను విజయవంతం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమానికి జాతీయ ద్రోణాచార్య అవార్డు గ్రహిత కోచ్ నాగపురి రమేశ్ హాజరయ్యారు.