క్యాన్సర్ రోగులకు అంతర్జాతీయ ప్రమాణాలు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావటమే తమ లక్ష్యమని బసవతారకం క్యాన్సర్ ఆస్ప్రత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు. అందులో భాగంగా బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డిజిటల్ రేడియోగ్రఫీ యంత్రాన్ని బాలకృష్ణ ప్రారంభించారు. కార్యక్రమంలో బాలయ్యతో పాటు ఆస్పత్రి సీఈఓ డాక్టర్ ప్రభాకర్ రావు, మెడికల్ డైరెక్టర్ టీఎస్ రావు, రేడియాలజీ విభాగం హెడ్ డాక్టర్ వీరయ్య చౌదరి సహా పలువురు వైద్యులు పాల్గొన్నారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన యంత్రంతో 8 గంటల్లో దాదాపు 200 లకు పైగా ఎక్స్రేలు తీయోచ్చని వైద్యులు పేర్కొన్నారు. తక్కువ ధరలో మెరుగైన వైద్యం అందించడమే బసవతారకం ఆస్పత్రి లక్ష్యమని బాలకృష్ణ తెలిపారు.
అత్యాధునిక పరికరాలతో వైద్యం...
"పెరుగుతున్న రోగులను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు వైద్యసేవలను ఆధునీకరించుకుంటున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో రోగులకు వైద్యం అందించాలన్న మా తల్లిదండ్రుల లక్ష్యాన్ని నెరవేర్చటమే మా బాధ్యత. అందులో భాగంగానే నేడు డిజిటల్ రేడియోగ్రఫీ యంత్రాన్ని.. రూ. 50 లక్షలు ఖర్చుపెట్టి ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. అత్యాధునిక పరికరాలతో క్యాన్సర్ రోగులకు వైద్యసేవలు అందిస్తున్నాం. ఆధునికతతో పాటు పేద ప్రజలకు అందుబాటు ఖర్చులోనే వైద్యం అందిస్తూ ముందుకు సాగుతున్నాం. ఆస్పత్రి గడప తొక్కిన ప్రతీ రోగికి... దేవాలయంలో అడుగుపెట్టిన భావన కలుగుతోందంటే.. దాని వెనక ఎంతో మంది కృషి దాగుంది. ఆస్పత్రిలో సేవలందిస్తూ.. ఎంతో మందిని రోగులను సాధారణంగా మార్చటంలో కృషి చేస్తూ.. పేరుప్రతిష్ఠలు తెచ్చిపెడుతున్న ప్రతీఒక్కరికి పేరుపేరునా నా కృతజ్ఞతలు, అభినందనలు." - నందమూరి బాలకృష్ణ, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్
ఇదీ చూడండి: