రాష్ట్రంలో వరుణుడి ప్రభావం కొనసాగుతోంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాబోయే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాల్లో కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ నాగరత్న వెల్లడించారు.
48 గంటల్లో అల్పపీడనం..
"సుమారు 18°N అక్షాంశం వెంబడి సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య ఉన్న తూర్పు - పశ్చిమ ద్రోణి బలహీన పడింది. ఇవాళ ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతూ.. నైరుతి దిశగా వంపు తిరిగి ఉంది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది."- డాక్టర్ నాగరత్న, వాతావరణ కేంద్రం సంచాలకులు.
భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు...
నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూలు, జగిత్యాల, ఖమ్మం, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, వికారాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా కురియనున్నట్లు తెలిపారు. ఈశాన్య, తూర్పు తెలంగాణా జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల.. అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని... రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని తెలిపారు.
జంటనగరాల్లో మోస్తరు వర్షాలు...
జంట నగరాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నట్టు అధికారులు తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సీయస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సీయస్ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి.