రాష్ట్రంలో (Telangana rain) పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది వర్షం సీజన్‌కు సంబంధించి నైరుతి రుతుపవనాలు నల్గొండ వరకు ఉపసంహరించాయి. ఉత్తర ఆంధ్రప్రదేశ్ - దక్షిణ ఒడిశా కోస్తా ప్రాంతాల పరిసర పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం... ఉత్తర కోస్తాంధ్ర, పరిసర పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల వరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉంది.
ఉరుములు, మెరుపులతో...
తూర్పు - పశ్చిమ ద్రోణి మర్థబన్ గల్ఫ్, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతం నుంచి తూర్పు - మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురుస్తాయి. రేపు కొన్ని చోట్ల.. ఎల్లుండి ఒకటీ లేదా రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఇవాళ, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మూడ్రోజుల పాటు...
ఆదిలాబాద్, కుమురం భీం - ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఒకటి లేదా రెండు ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలలో ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో భారీ వర్షాలు సూచనలు ఉన్నాయి. రేపు కొన్ని జిల్లాల్లో ఒకటి లేదా రెండు ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు చాలా జిల్లాల్లో ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా (Telangana rain) రాబోయే మూడు రోజుల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు, కొన్ని ప్రదేశాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : భాగ్యనగరంలో భారీ వర్షం.. చెరువుల్లా మారిన రహదారులు