Heavy Rains in AP: ఏపీలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగర శివారులోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గుంటూరు - తుళ్లూరు రహదారిపై పెద్దపాలెం వద్ద కొట్టేల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పెదపరిమి - మంగళగిరి మధ్య నీరుకొండ వద్ద కొండవీటి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రహదారులపై వర్షపు నీరు నిలవడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల పరిధిలో కొన్నిచోట్ల వర్షాల వల్ల పంట పొలాలు నీట మునిగాయి.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. తిరువూరు బైపాస్ రోడ్డు నుంచి ఫ్యాక్టరీ సెంటర్ వరకు ప్రధాన రహదారి వాగును తలపిస్తోంది. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి కార్యాలయం వరదనీటి ముంపులో చిక్కుకుంది. రహదారులపై దాదాపు 2అడుగులమేర నీరు నిలిచిపోవటం వల్ల రాకపోకలు సాగించడానికి అవస్థలు పడుతున్నారు. రాజుపేటలో నివాస గృహాల్లోకి వరద నీరు చేరింది. వరద ఉద్ధృతికి తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ జలమయమైంది.
విశాఖలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. విశాఖ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ జోరు వానలు పడుతున్నాయి. మధురవాడ, ఆనందపురం, ఎండాడ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
హనుమంతవాక, ఓల్డ్ డెయిరీ ఫామ్, గాజువాక, కూర్మన్నపాలెం, మల్కాపురం, సింధియా, జ్ఞానాపురం, పాతనగరం, అక్కయపాలెంలో వర్షం పడుతోంది. బీచ్ రోడ్డు, మద్దిలపాలెం, ఎన్‌ఏడీ కొత్త రోడ్డు, మర్రిపాలెంలోనూ వాన కురుస్తోంది
అనకాపల్లి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి, ఎస్ రాయవరం మండలాల్లో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పాయకరావుపేటలో తాండవ నదికి వరద నీరు వచ్చి చేరుతోంది. అనకాపల్లిలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షంతో అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ జలమయం అయ్యింది. దాంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సత్యసాయి జిల్లా: వరసగా మూడురోజులు ఎడతెరిలోకుండా వర్షాలు కురుస్తున్న కారణంగా శ్రీ సత్య సాయి జిల్లాలోని హిదూపురం మండలం మలుగూరు గ్రామంలో ఇంటిపై కప్పు కూలి శ్రీకాంత్ అనే రెడేళ్ల బాలుడు మృతి చెందాడు. మూడు రోజులుగా ఏక ధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా అర్థరాత్రి ఒక ఇంటిపై కప్పు కూలిపోయింది. ఆ సమయంలో చంద్రప్ప అతని కుటుంబ సభ్యులు ఇంటిలో నిద్రిస్తుండగా అప్రమత్తమై అందరూ బయటకి వచ్చేయగా రెండు సంవత్సరాల బాలుడు ప్రమాదం బారిన పడ్డాడు. అక్కడే చిక్కుకున్న బాలుడు శ్రీకాంత్ అక్కడిక్కడే మృతి చెందాడు. తమ బిడ్డని కాపాడుకోలేకపోయామంటూ కుంటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
కృష్ణా జిల్లాలోని దివిసీమలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవనిగడ్డ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్న టెంట్లు పనులు నిలిచిపోయింది. అవనిగడ్డ నాగాయలంక ప్రధాన రహదారి జలమయం కావటంతో జనజీవనం స్తంభించిపోయింది.
ఎగువ కురిసిన భారీ వర్షాలకు పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. శ్రీశైలం, నాగర్జున సాగర్ నుంచి నీరు వదులుతుండటంతో పులిచింతలకు నీటి ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టు నుంచి 15గేట్లు ఎత్తి నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇవీ చదవండి: