నివర్ తుపాను ప్రభావంతో..ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో మైపాడు బీచ్ వద్ద సముద్రం అలజడి సృష్టిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక స్థానిక మత్య్సకారులు ఆందోళన చెందుతున్నారు. మర్రిపాడు మండలంలో మిర్చి, మినుము, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కలువాయి మండలం చింతల ఆత్మకూరును వరద చుట్టుముట్టింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బొగలదిన్నె నీటి ప్రవాహంతో గ్రామస్థుల్లో భయాందోళన నెలకొంది. కలిగిరి మండలాల్లో పలు చెరువులు ప్రమాదకరస్థితికి చేరుకున్నాయి.
వెంకటగిరి - రాపూరు మధ్య లింగసముద్రం వంతెన కూలింది. స్వర్ణముఖి నది, కొండాపురం మండలంలో మిడతవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ప్రవహంతో.. సత్యవోలు ఆగ్రహారం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాగుంట లేఔట్ ప్రాంతంలో వర్షానికి ఓ చెట్టు విరిగి ఓ వ్యక్తి మృతి చెందాడు.
తుపాన్ ప్రభావంతో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నెల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏదైనా సమాచారం కోసం కాల్ సెంటర్ నెంబర్ 897 876 2988 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నారని.. ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉన్నామని కలెక్టర్ తెలిపారు.
వెంకటగిరి నియోజకవర్గంలో రాత్రి నుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కైవల్య నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దక్కిలి మండలం నడింపల్లి, బాలాయపల్లి మండలం నిండాలి దగ్గర కైవల్య నది కాజ్వేల పై ప్రవాహం ఉప్పొంగడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతుంది.
ఇదీ చదవండి: సీఎం వెంటనే స్పందించాలి: బండి