Heavy rain: రాత్రి కురిసిన భారీ వర్షంతో ఏపీలోని అనంతపురం నగరంలోని కాలనీలను వరద ముంచెత్తింది. చాలా కాలనీల్లోకి వరద నీరు పెద్ద ఎత్తున ప్రవేశించటంతో జనావాసాలన్నీ జలదిగ్భంధంలో ఉన్నాయి. మంగళవారం రాత్రి రెండు గంటల సమయం నుంచే భారీ వర్షంతో ఎగువ ప్రాంతం నుంచి వరద పోటెత్తింది. యాలేరు, ఆలమూరు చెరువుల నుంచి వరద అనంతపురం నగరాన్ని ముంచెత్తింది. ఆలమూరు చెరువు నుంచి నడిమివంకకు ఎన్నడూ లేనంతగా భారీ ప్రవాహం వచ్చింది. దీనికి తోటు నడిమివంక పూర్తిగా ఆక్రమణలకు గురికావటంతో ప్రవాహం వెళ్లటానికి దారిలేక కాలనీలను ముంచెత్తింది.
వరద భయంతో మిద్దెలపైకి వెళ్లిన ప్రజలు: నగరంలోని 5, 6 రోడ్డు, సోమనాథనగర్, రంగస్వామి నగర్‌లో జనావాసాలు పూర్తిగా జలదిగ్భంధంలో ఉన్నాయి. అనంతపురం గ్రామీణ మండలంలోని గౌరవ గార్డన్స్, రుద్రంపేట పంచాయతీ, యువజన కాలనీ తదితర కాలనీలన్నీ పూర్తిస్థాయిలో జలదిగ్భంధంలో ఉన్నాయి. ఇళ్లలోకి వరద ప్రవేశించటంతో అర్దరాత్రి దాటాక ప్రజలు మిద్దెలపైకి వెళ్లి భయంగా గడిపారు. ఇప్పటికీ అనేక కాలనీల్లో మూడు అడుగుల మేర వరద ప్రవహిస్తూనే ఉంది. అనంతపురం జలదిగ్బంధమైంది. భారీ వర్షానికి మంగళవారం రాత్రి 2గంటల సమయంలో యాలేరు, ఆలమూరు చెరువుల నుంచి అనంతపురం నగరంలోకి వరద పోటెత్తింది. నడిమివంక ఒక్కసారిగా ఉరకలెత్తింది. నడిమివంక ఆక్రమణలకు గురవడంతో ఆ నీరంతా వెళ్లేదారిలేక సమీప కాలనీలను ముంచెత్తింది.
నిలిచిపోయిన విద్యుత్ సరఫరా: నడిమివంక ఉద్ధృతికి యువజన కాలనీ, రజకనగర్, రంగస్వామినగర్ సహా అనేక శివారు కాలనీలు జలమయం అయ్యాయి. కనుచూపు మేరలో నీళ్లే కనిపిస్తున్నాయి. చాలాచోట్ల 3 అడుగు మేర వరద ప్రవహిస్తోంది. ఇళ్లు, రోడ్లు, డ్రైన్లు అన్నీ ఏకమయ్యాయి. ఎటువీలుంటే అటే వరద నీరు ముంచెత్తుతోంది. చంద్రబాబు నగర్‌లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. కక్కలపల్లి కాలనీలోని ఆదర్శనగర్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. పలు ముంపు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇళ్లను వరద ముంచెత్తడంతో స్థానికులు అర్ధరాత్రి మిద్దెలపైకి వెళ్లారు. కంటి మీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటూగడిపారు ఇంట్లో పొయ్యి వెలిగించలేని పరిస్థితుల్లో ముంపు బాధితులు ఆహారం కోసంఎదురుచూస్తున్నారు.
స్తంభించిన జనజీవనం: బాధితులను ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరానికి తరలించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం కర్నూలు నుంచి విపత్తు నిర్వహణా బృందాలను, శింగనమల నుంచి పడవలను అధికారులు రప్పిస్తున్నారు. అంతపురం జిల్లా కంబదూరు మండలం రాళ్ల అనంతపురం సమీపంలో కాజ్వే కూలిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాళ్ల అనంతపురం- ఐపార్సపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు వడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. వరద పోటుకు అనంతపురంలోని రుద్రంపేట కూడా జలమయమైంది.
ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న వాగులు: అక్రమ కట్టడాల వల్లే నడిమివంక తమ ఇళ్లను ముంచెత్తిందంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వంకకు అడ్డంగా నిర్మించిన ఓ ప్రహరీగోడను.. కూల్చేశారు. కంబదూరు మండలం కేంద్రశివార్లలో శ్రీ కమల మల్లేశ్వర ఆలయ సమీపంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో యువకుడు బైకుతో పాటు కొట్టుకుపోతుండగా స్థానికులు రక్షించారు. కంబదూరు మండల కేంద్రం నుంచి ఐపార్సపల్లి గ్రామానికి వెళ్తున్న రాము అనే యువకుడు వాగు దాటుతున్న సమయంలో వాగు ఉద్ధృతికి మోటార్ సైకిల్‌తో పాటు కింద పడిపోయి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. పక్కనే ఉన్న ముళ్ల కంప చెట్టును పట్టుకుని యువకుడు నిలబడి పోగా మోటార్ సైకిల్ ప్రవాహంలో కొట్టుకుపోయింది.
నీట మునిగిన పంటలు: వాగు ప్రవాహాన్ని చూడటానికి వచ్చిన ఆ ప్రాంతానికి చెందిన పలువురు యువకులు వెంటనే ఒకరి చేతిలు ఒకరికి అందించుకుని చెట్టు పట్టుకుని నిలబడిన యువకుడిని బయటికి తీసుకొచ్చారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఒంటారెడ్డి పల్లి, జల్లిపల్లి గ్రామాల్లో అధిక వర్షాలకు గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలువురు రైతుల పంట పొలాలు నీటిలో మునిగి తీవ్రంగా నష్టపోతున్నారు. ఉంటా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరావు 2 ఎకరాల్లో సాగుచేసిన టమోటా పంట అంతా వర్షానికి నట్టేట మునిగింది.
భయం గుప్పెట్లో పలు గ్రామాలు: అర్ధరాత్రి సమయంలో కురిసిన వర్షానికి నెలరాలి పోవడంతో రైతు కన్నీరుమున్నీరయ్యాడు. సమీపంలో భారీ వంక పారడంతో వర్షపు నీరు టమాట పంటపొలంలోకి వచ్చిందని వాపోయాడు. ఇదే మండలంలోని లొతట్టు ప్రాంతమైన జల్లిపల్లి గ్రామ ఎస్సీ కాలనీలో ఇళ్లలోకి అంతా వర్షపు నీరు చేరి అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇళ్లలోకి లోతట్టు ప్రాంతం కావడంతో కాలనీతో పాటు గ్రామం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వర్షం వస్తే చాలు భయపడే పరిస్థితి ఈ గ్రామంలో నెలకొంది.
ఇవీ చదవండి: