రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ ఆవిష్కరించిన రోజే ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి ప్రదర్శించాయి. తొలిరోజే ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో రూ.3200 కోట్లను ప్రభుత్వం ఆకర్షించింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీలు ప్రకటిస్తూ.. ప్రభుత్వంతో ఇందుకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ఇందులో భాగంగా 3 కంపెనీలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోగా... మరో 2 కంపెనీలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్లను అందజేసినట్లు ప్రభుత్వం తెలిపింది. పెట్టుబడుల్లో భాగంగా మైత్ర ఎనర్జీ రూ.2 వేల కోట్లు, ఒలెక్ట్రా రూ.300 కోట్లు, ఈటీఓ మోటార్స్ రూ.150 కోట్లు, గాయం మోటార్స్ రూ.250 కోట్లు, ప్యూర్ ఎనర్జీ రూ.500 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఈ పెట్టుబడుల ద్వారా మొత్తం 14,750 ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.