వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు విషజ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. ప్రజారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావుతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. కరోనా వచ్చిన మొదటి రోజు నుంచి మేమున్నామంటూ ప్రజలకు ధైర్యం చెప్పి కట్టడి, చికిత్సలో అలుపెరుగని కృషి చేస్తున్నారని సిబ్బందిని అభినందించారు. అదే తరహాలో వరదల కష్ట కాలంలోనూ ప్రజలకు అండగా ఉండాలని కోరారు.
వరదల నేపథ్యంలో కలుషిత నీరు, వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కోరిన మంత్రి ... సీజనల్ జ్వరాలు, ఇతర ఆరోగ్య సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు. జ్వరం రాగానే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకొని తగిన చికిత్స తీసుకోవాలని కోరారు. నీరు, ఆహారం కలుషితమయ్యే అవకాశం ఉన్నందున కాచి వడగట్టిన నీటిని మాత్రమే తాగాలని, వేడివేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలని సూచించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికీ 165 క్యాంపులను ఏర్పాటు చేశామన్న అధికారులు... మరో 46 మొబైల్ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసినట్టు వివరించారు. క్యాంపుల్లో 24 గంటల పాటు సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు. పునరావాస కేంద్రాల్లోని 16వేల మందికి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఇచ్చినట్టు తెలిపారు.
కరోనా లక్షణాలున్న రెండు వేల మందికి పరీక్షలు చేస్తే 19 మందికి పాజిటివ్ నిర్ధరణ అయినట్టు వివరించారు. వారందరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. మాస్కులు, శానిటైజర్లు, మందులు అందిస్తున్నామని తెలిపారు. జలమండలి సహకారంతో అన్ని ప్రాంతాల నుంచి నీటి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపిస్తున్నామని, నీరు కలుషితం కాకుండా క్లోరినేషన్ చేస్తున్నామన్నారు. వరద నీటిలో చిక్కుకున్న ప్రాంతాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందిస్తున్నట్టు తెలిపారు.
ఇదీ చూడండి: కిట్లో రూ.2,800 విలువ చేసే నిత్యావసరాలు, 3 దుప్పట్లు: కేటీఆర్