Haryana Mewat gang: హర్యానా రాష్ట్రంలోని మేవాత్ జిల్లా. రాజస్థాన్, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్... ఈ మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటుంది. మేవాత్ జిల్లాలో అధిక శాతం మంది దొంగతనాలనే వృత్తిగా కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ముఠాలు దిల్లీ సహా ... దేశంలోని ప్రధాన నగరాలలో దోపీడీలు పాల్పడుతూ అలజడి సృష్టిస్తున్నాయి. దోపిడీలు చేసే సమయంలో అడ్డు వస్తే హతమార్చేందుకు సైతం వీరు వెనకడుగు వేయరు. ఇటీవల జాతీయ రహదారులపై లారీలు కంటైనర్లను దోచుకుంటున్న ముఠాలు మేవాత్‌కు చెందినవేనని గుర్తించారు. 16, 21 ఏళ్ల మధ్య ఉన్న యువకులే ఎక్కువ మంది నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 100 నుంచి 110 దొంగల ముఠాలు మేవాత్‌లో ఉన్నట్టు అంచనా.
ఒక మేవాత్ ముఠా ఇటీవల పహాడిషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తుక్కుగూడ బాహ్యవలయ రహదారి వద్ద టైర్ల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ డ్రైవర్‌కు తుపాకీ చూపి బెదిరించి కంటైనర్‌ను ఎత్తుకుపోయారు. అందులోని టైర్లను దోచుకున్నారు. ఈ ముఠాలోని ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు జంషేద్‌ఖాన్ పారిపోతుండగా దిల్లీ విమానాశ్రయంలో పట్టుకోవడంతో గుట్టురట్టయింది.
మొదట్లో పశువులు, ద్విచక్ర వాహనాలు దొంగిలించి విక్రయించేవారు. ఆ తర్వాత లారీలు, కంటైనర్ల డ్రైవర్లను లిఫ్ట్ అడిగి... మరణాయుధాలతో బెదిరించి దోపిడీలకు పాల్పడడం మొదలుపెట్టారు. ఏటీఎంలను లూటీ చేయడం... కార్లు ఖరీదైన వస్తువులు రవాణా చేసే లారీలు, కంటైనర్లలను ఎత్తుకుపోవడం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఈతరహా దోపిడీలకు పాల్పడే మేవాత్ ముఠాలు సుమారు 30 వరకు ఉంటాయని అంచనా. లారీలు, కంటైనర్లలో ప్రయాణికులుగా ఎక్కి తమ పని పూర్తి చేసుకుంటున్నారు. ఏ ముఠా ఎటువెళ్లాలి... ఏం చేయాలనే విషయంపై ఈ నేరగాళ్లు ముందుగానే చర్చించుకుని మరీ దోపిడీలు చేస్తుంటారు. కరుడుగట్టిన మేవాత్ ముఠాలు సొంత ఊళ్లలో మాత్రం దొంగతనాలు, దోపిడీలకు పాల్పడడం లేదని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. రాచకొండ పోలీసుల అరెస్టు చేసిన మేవత్ ముఠాను కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించాలని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: