Wheel Chair Cricket Tourney : అవయవ లోపాన్ని చాలా మంది శాపంగా భావిస్తుంటారు. మిగతా వారితో పోల్చుకుని.. ఆత్మనూన్యతకు గురవుతుంటారు. అలాంటి వాళ్లంతా.. వీల్ ఛైర్‌లో కూర్చుని మైదానంలో క్రికెట్ ఆడుతున్న వీళ్లను చూస్తే కచ్చితంగా మనసు మార్చుకుంటారు. వాళ్ల ఆవేదనను మరిచి.. 'అనుకుంటే.. జీవితాన్ని తమకు తామే ఆనందమయం చేసుకోవచ్చు' అని భరోసా పొందుతారు.
కుంగిపోలేదు.. లొంగిపోలేదు..
International Para Cricket : వీళ్లంతా.. దివ్యాంగులు. కొంతమంది పోలియోకు గురై దివ్యాంగులుగా మారితే, మరి కొందరు రోడ్డు ప్రమాదాల కారణంగా శరీరావయవాలు కోల్పోయారు. నిజానికి.. వీరంతా చాలా విషయాలకి ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితే. అయినా.. విధి ఆటకు వీళ్లు కుంగిపోవాలను కోలేదు. ఇళ్లకే పరిమితమై జీవితాన్ని నిరాశలో ముంచేయలేదు.
వికెట్ల పనిపట్టారు..
Handicapped in International Para Cricket : ధైర్యంగా ముందడుగేసి, తమకంటూ ప్రత్యేక లక్ష్యాల్ని ఏర్పాటు చేసుకుని శ్రమిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఈ యువకులంతా హనుమకొండ వేదికగా నిర్వహించిన వీల్ చైల్ క్రికెట్ పోటీల్లో పాల్గొన్నారు. బ్యాట్‌లు పట్టి కొందరు బాల్‌ను బౌండరీలు దాటించారు. బౌల్‌తో వికెట్ల పని పట్టారు మరికొందరు.
దివ్యాంగ క్రీడాకారుల పోటీలు..
Handicapped in Wheel Chair Cricket Tourney : దివ్యాంగులకూ క్రికెట్ పోటీలు పెట్టాలనే ఉద్దేశంతో.. 2 ఏళ్ల క్రితం శ్రీధర్ ఈ వీల్ చైర్ క్రికెట్ పోటీలు ప్రారంభించాడు. రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన క్యాంప్‌లు పెట్టారు. ఎంపికలు నిర్వహించి, ఆసక్తి ఉన్న దివ్యాంగ యువతకు.. ప్రతిభ నిరూపించుకునేందుకు అవకాశం కల్పించారు. అలా వివిధరాష్ట్రాల దివ్యాంగ క్రీడాకారుల్ని ఆహ్వానించి.. పోటీలు నిర్వహిస్తున్నారు.
ఫీల్డ్‌లో దిగి.. ఫీల్డింగ్ చేశారు..
ఈ పోటీలకు.. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్ నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. మైదానం సిద్ధం చేసుకోవడం నుంచి కావాల్సిన అన్ని పనులు స్వయంగా చేసుకున్నారు. తర్వాత ఒక్కొక్కళ్లుగా మైదానంలోకి దిగి.. బ్యాంటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ప్రతిభ చూపించారు.
ఆటంకాలు ఎదురైనా ఆపలేదు..
వీరిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల నుంచి చిరు వ్యాపారాల వరకు చాలా మంది ఉన్నారు. అవయవ లోపం మరిచి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని పిలుపునిస్తున్నారు. ఆటంకాలు ఎదురైనా.. అక్కడే నిలిచిపోవద్దని సూచిస్తున్నారు. తమ లోపాల గురించి కాకుండా.. సామర్థ్యాలపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు.
పట్టుదల, లక్ష్యంపై గట్టి సంకల్పం ఉంటే సాధించలేనిదేదీ లేదని నిరూపిస్తున్నారు ఈ యువకులు. వైకల్యంతో మానసికంగా కృంగిపోకుండా, దృఢంగా నిలిస్తే.. గెలుపు శిఖరాలను అందుకోవచ్చని నిరూపిస్తున్నారు.