కష్టాల కడలి ఈదుతూ.. తనకంటూ ఓ గుర్తింపు ఉండాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న ఈ ఒంటి చేతి వీరుడు... తేజిందర్ మెహ్రా. దిల్లీలోని ఓ నిరుపేద కుటుంబంలో ఒంటి చేత్తోనే పుట్టాడు మెహ్రా. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న తమకు భవిష్యత్‌కు భారమని 2నెలల పసికందుగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు వదిలించుకున్నారు. 20 వేలకు అమ్మకానికి పెట్టారు.
ఆ ప్రయత్నాల్ని మేనత్త అడ్డుకుంది.. తానే మెహ్రాను చూసుకుంటానని చేరదీసింది. ఉన్నంతలో చదివించింది. చిరుప్రాయంలో... స్నేహితులు బైక్ నడపడం, జిమ్‌లకు వెళ్లడం చూసి తానెందుకు ఇలాంటి చేయలేనని అనుకున్నాడు తేజిందర్ మెహ్రా. వెంటనే ప్రయత్నాలు ప్రారంభించాడు. వైకల్యం మెహ్రా ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేకపోయింది... కానీ చుట్టూ ఉన్న సమాజం నిత్యం వెనక్కు లాగేందుకే ప్రయత్నించింది. అందుకే... ఇంటి మేడపైనే జిమ్ వర్క్ అవుట్స్ ప్రారంభించాడు. ఒంటి చేత్తో ఏదైనా సాధించి సమాజానికి తానేంటో చూపించాలనుకున్నాడు.
తేజిందర్ పట్టుదల చూసి... జిమ్‌లో కసరత్తులు చేయాలని స్నేహితులు ప్రోత్సహించారు. కానీ... ఆర్థికభారం ఉండకూడదని ప్రభుత్వ వ్యాయామశాలలో కసరత్తులు మొదలుపెట్టాడు. వైకల్యం బలహీనత కాకుడదు, ఇతరులు లోపంగా చూసిన దేహమే బలంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పట్టువిడవక సాధన చేస్తూ వచ్చాడు. ఒకప్పుడు చిన్నచిన్న పనులకే ఇబ్బంది పడ్డ మెహ్రా... పెద్దపెద్ద బరువులు ఎత్తే స్థాయికి చేరుకున్నాడు.
మెహ్రా పట్టుదల చూసి ప్రైవేట్ జిమ్ ట్రైనర్ దినేష్.. తన జిమ్‌లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ట్రైనర్ ప్రత్యే శ్రద్ధ, మోహ్రా కఠోర శ్రమతో కండలు తిరిగిన శరీరం సొంతమైంది. శరీరకంగానే కాగా.. మానసికంగానూ రెట్టింపు బలం సొంతం చేసుకున్న మెహ్రా... 2017 మిస్టర్ దిల్లీ బరిలో దిగాడు.
తొలి ప్రయత్నంలోనే విజయంతో అప్పటి వరకు వెంటాడిన వైకల్య భావన చిన్నబోయింది. తనపై తనకు మరింత నమ్మకం కుదింరింది. మరింత ఉత్సాహంతో కష్టపడ్డాడు. రెండోసారీ మిస్టర్ దిల్లీ అవార్డు గెలుచుకున్నాడు... 2020లో ఉత్తర భారత బాడీ బిల్డర్ పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్యర్చపరిచాడు.
బాడీ బిల్డింగ్ అంటే ఖర్చుతో కూడుకున్న పని, పోషకాలతో కూడిన ఆహారం. సమయానుసార ఆహార నియమాలు ఉండాల్సిందే. సాధించాలనే పట్టుదల, కష్టపడే తత్వం మెండుగా ఉన్నా... ఆర్థిక పరిస్థితే మెహ్రాను వెనక్కిలాగుతోంది. ప్రతి దశలో అడ్డుగా నిలిచి ముందు తనని దాటాలని సవాల్ చేస్తోంది.
కరోనాకు ముందు ఫాస్ట్ ఫుడ్ సెంటర్, జిమ్ ట్రైనర్‌గా కొంత డబ్బులు సంపాదించిన మెహ్రాను.. లాక్‌డౌన్ తీవ్రంగా దెబ్బతీసింది. ప్రస్తుతం.. ఎలాంటి ఉపాధి దొరకక ఖాళీగానే ఉంటున్నాడు. కొన్ని చోట్ల తన వైకల్యం చూపి పని ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న మెహ్రా... దిల్లీ ప్రభుత్వం, మరెవరైనా దాతలు చేయూత అందివ్వాలని కోరుతున్నాడు.
ఒంటి చేత్తో మిస్టర్ దిల్లీగా నిలిచిన మెహ్రా.. మిస్టర్ ఇండియాగానూ నిలిచి తీరతానని నమ్మకంగా చెబుతున్నాడు. వైకల్యం శరీరానికే కానీ.. ప్రతిభకు కాదంటున్న మెహ్రా... యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.