TS Council Chairman: శాసనమండలి ఛైర్మన్ పదవికి ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, గిరిజన, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ సహా తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఛైర్మన్ ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. రేపు ఉదయం 11 గంటలకు మండలి ఛైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ మేరకు మండలి అధికారులు సభ్యులకు సమాచారం అందించారు. ఒకటే నామినేషన్ వస్తే గుత్తా ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
ఇటీవలే శాసనసభ కోటా నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గతంలోనూ మండలి ఛైర్మన్‌గా గుత్తా బాధ్యతలు నిర్వహించారు. ఛైర్మన్ ఎన్నిక అనంతరం డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికను చేపట్టనున్నారు. డిప్యూటీ ఛైర్మన్‌గా బండా ప్రకాశ్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
రెండోసారి శాసనమండలి ఛైర్మన్‌గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు గుత్తా కృతజ్ఞతలు తెలిపారు. తనను బలపరిచిన అన్ని పార్టీల శాసనమండలి సభ్యులకు గుత్తా ధన్యవాదాలు తెలిపారు. గతంలో మాదిరిగా సభను హుందాగా నడిపేందుకు కృషిచేస్తానని గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఇదీచూడండి: అభిమానుల బర్త్‌డే విషెష్.. సముద్రంలో పడవలపై కవిత ఫొటోలు ప్రదర్శన