TURKEY BRIDE MARRAGE: ఏపీ గుంటూరుకు చెందిన మధు సంకీర్త్, టర్కీకి యువతి గిజెమ్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తొలిచూపులోనే మనసు పారేసుకున్న వీరిద్దరూ.. ఆ బంధాన్ని పెళ్లితో శాశ్వతం చేసుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించగా సాంప్రదాయబద్ధంగా ఒక్కటయ్యారు.
అలా మొదలైంది..
టర్కీకి చెందిన గిజెమ్.. 2016లో ఒక ప్రాజెక్టు పనిమీద భారత్‌కు వచ్చింది. అప్పుడు సంకీర్త్‌తో పరిచయం ఏర్పడింది. అదే ఏడాది ఉద్యోగం కోసం సంకీర్త్ టర్కీ వెళ్లాడు. తన సహోద్యోగికి గిజెమ్ స్నేహితురాలు కావడం వల్ల అలా మరోసారి కలుసుకున్నారు. దీంతో.. వారి పాత పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్లకే పెళ్లి చేసుకోవాలనే వరకూ వెళ్లింది. ఇద్దరూ పెద్దలకు విషయం చెప్పారు.
పెద్దలు ఏమన్నారంటే..?
సంకీర్త్ తండ్రి దమ్మాటి వెంకటేశ్వర్లు వీరి పెళ్లికి సరేనన్నారు. తల్లి గౌరీ శంకరి మాత్రం సంశయించింది. అమ్మాయి వైపు కూడా ఇదే పరిస్థితి. అయితే.. పిల్లల మనసులు కలవటంతో మనం ఎందుకు అడ్డుచెప్పాలని అనుకున్నారు. కొద్దిరోజుల తర్వాత అందరూ సరేనన్నారు. ఈ క్రమంలో 2019లో గుంటూరులో వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. 2020లో పెళ్లి చేసుకోవాలని భావించినా.. కరోనా అడ్డంకిగా మారింది. చివరకు ఈ ఏడాది జులైలో అమ్మాయి కుటుంబ సంప్రదాయాల ప్రకారం టర్కీలో వివాహం జరిగింది. గిజెమ్ బంధువులు, స్నేహితుల ఆనందోత్సాహాల మధ్య.. విందు వినోదాలతో ఉత్సాహంగా పెళ్లితంతు పూర్తిచేశారు.
కొవిడ్ ఆంక్షలు తగ్గిన తర్వాత ఇటీవలే వారు ఇండియాకు వచ్చారు. ఇప్పుడు హిందూ సంప్రదాయ విధానంలో పెళ్లికి సిద్ధమయ్యారు. మనసులు అర్థం చేసుకోవడమే కాదు.. సంప్రదాయాలను కూడా గౌరవించాలని భావించి, రెండు పద్ధతుల్లోనూ వివాహం చేసుకున్నట్టు చెబుతోందీ జంట.
ఇటీవలే సంకీర్త్.. ఉద్యోగం కోసం ఆస్ట్రియాకు మారాల్సి వచ్చింది. గిజెమ్ కూడా అతడిని అనుసరించింది. కొన్నాళ్లు అక్కడే పనిచేసి తర్వాత ఇండియాకు రావాలని భావిస్తున్నట్లు సంకీర్త్, గిజెమ్ చెబుతున్నారు. సంకీర్త్ తండ్రి దమ్మాటి వెంకటేశ్వర్లు వ్యవసాయశాఖలో ఉన్నతాధికారి. తల్లి గౌరీశంకరి శిశుసంక్షేమ శాఖలో పనిచేస్తున్నారు. కుమారుడు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: