ముఖ్యమంత్రి కేసీఆర్‌తో గుజరాత్ మాజీ సీఎం శంకర్‌సింగ్ వాఘెలా ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు తెలంగాణ ప్రగతి, దేశ పరిస్థితులు, జాతీయ రాజకీయాలపై చర్చిస్తున్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వ పోకడలు, భాజపా రాజకీయ క్రీడ, ప్రజలపై దాని పర్యవసానాలపై ఇరువురు నేతలు మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పలువురితో సంప్రదింపులు చేస్తున్నారు. త్వరలోనే జాతీయ పార్టీ ప్రకటనకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సింగ్ వాఘెలాతో సమావేశం ప్రాధాన్యత సంతరించుకొంది.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని గుజరాత్ మాజీ సీఎం శంకర్‌సింగ్ వాఘేలా ఆహ్వానించారు. భాజపా రాజకీయాల పట్ల అందరూ ఆందోళనతో ఉన్నారని అన్నారు. మోదీ విచ్ఛిన్నకర పాలనపై దేశమంతా ఆందోళన ఉందని తెలిపారు. ప్రజాస్వామిక వాదులు, ప్రగతి కాముకులు మౌనం వహించటం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరముందని శంకర్‌సింగ్ వాఘేలా పేర్కొన్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని శంకర్‌సింగ్ వాఘేలా అన్నారు. భాజపా దుర్మార్గ రాజకీయాలు తిప్పికొట్టాలని ఆయన ఆకాంక్షించారు. శంకర్‌సింగ్ వాఘేలా ఆహ్వానానికి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దేశ రాజకీయాలు, పాలనలో గుణాత్మక మార్పునకు కృషి చేస్తానని చెప్పారు. వాఘేలా వంటి సీనియర్లు స్వచ్ఛంద మద్దతు ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ప్రత్యక్ష జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆయా పార్టీల నేతలను కలుస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నాయకులను హైదరాబాద్‌కు రమ్మని ఆహ్వానిస్తున్నారు. మొత్తానికి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడబెట్టుకుంటున్నారు. కేంద్రంలోకి బీజేపీ రహిత ప్రభుత్వం రావాలనే నినాదాన్ని బలంగా తీసుకెళ్తున్నారు. ఇదే నినాదంతో ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీల నేతలు కేసీఆర్‌కు మద్దతు పలుకుతున్నారు.