చుట్టూ పచ్చని మొక్కలతో ఆహ్లాదంగా కనిపిస్తున్న ఈ ఇల్లు.... ఏ పల్లెటూర్లో ఉందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉంది. ఇరుకైన కాలనీ నివాసాల మధ్య ఉన్న ఇంట్లో విశాలమైన పెరటి తోటలు సాగు చేస్తున్నారు అంజమ్మ. పల్లె వాతావరణంలో పుట్టి పెరిగిన ఆమెకు చిన్నతనం నుంచి మొక్కల పట్ల ఉన్న మక్కువతో పెరటి తోటలపై దృష్టి పెట్టారు. ఏడు సెంట్ల స్థలంలో సేంద్రీయ ఎరువులతో వివిధ రకాల పండ్లు, కూరగాయలు , ఆకుకూరలు, పూల మొక్కలను పెంచుతున్నారు.
భర్త సుబ్బారావు మిలటరీలో పనిచేస్తున్న సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో నివాసం ఉన్నా కూడా.... కుండీల్లో వివిధ రకాల పూలమొక్కలు పెంచేవారు. పదవీ విరమణ తర్వాత.... ఒంగోలులో విశాలమైన ఇల్లు నిర్మించుకున్నారు. అందులో ఇంకా పెద్ద అపార్ట్‌మెంట్ కట్టుకునేంత స్థలం మిగిలే ఉంది. కానీ ఆరోగ్యవంతమైన జీవనానికి ప్రశాంత వాతావరణం ముఖ్యమని భావించి ఇంటిని చిన్నిపాటి వనంలా మార్చేశారు.
సొంతంగా మొక్కలు, చెట్లు పెంచి వాటి మధ్య జీవనం సాగిస్తే వచ్చే తృప్తి చాలా బాగుందని... తన భార్య ఇష్టాన్ని తాను ఎప్పుడూ ప్రోత్సహిస్తానని భర్త సుబ్బారావు అంటున్నారు.