గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. డివిజన్ల వారీ లెక్కింపు కేంద్రాల్లో మొత్తం 166 కౌంటింగ్ టేబుళ్లలో లెక్కింపు జరిగింది.
55 స్థానాల్లో కారు జోరు
ప్రచారానికి తగ్గట్లే బల్దియా ఎన్నికల ఫలితాల్లో అధికార తెరాస జోరు సాగించినా... 55 స్థానాల్లో మాత్రమే గులాబీ పార్టీ అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు. మొదటి నుంచి భాజపా నుంచి పోటీ ఎదుర్కొన్న తెరాస... గతం కంటే తక్కువ సీట్లను దక్కించుకుంది.
పతంగి పట్టు....
పాతబస్తీపై తనకున్న పట్టును ఎంఐఎం... మరోసారి నిలబెట్టుకుంది. ఆయా డివిజన్లలో మజ్లిస్ అభ్యర్థులు... మంచి మెజార్టీలతో విజయం సాధించారు. మెహదీపట్నం నుంచి ఆ పార్టీ నుంచి మాజిద్ హుస్సేన్ విజయంతో మజ్లిస్ బోణీ కొట్టింది. 44 డివిజన్లలో పతంగి రెపరెపలాడింది.
వికసించిన కమలం...
అగ్రనేతల ప్రచారంతో హోరెత్తించిన భాజపా... ఫలితాల్లోనూ తనదైన మార్కు చూపెట్టింది. గత ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైన కమలం.. ప్రస్తుత ఎన్నికల్లో ఊహించని రీతిలో వికసించింది. 48 స్థానాల్లో విజయభావుటా ఎగరేసి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపింది.
హస్తానికి రెండే...
బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ ఉనికిని చాటుకుంది. జీహెచ్ఎంసీ పోరులో హస్తం పార్టీ మరోసారిప్రభావాన్ని చూపలేకపోయింది. గత ఎన్నికల్లో రెండు స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ .. ప్రస్తుత ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.