రాష్ట్రవ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలు కిటకిటలాడాయి. మహిళలు పెద్ద ఎత్తున పుట్టల వద్దకు వెళ్లి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డిలో ఉదయం నుంచే మహిళలు పుట్టల వద్ద పాలు పోసి మెుక్కులు తీర్చుకున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోనాగదేవత అమ్మవారికి మహిళలు ఘనంగా అభిషేకం నిర్వహించారు. జహీరాబాద్‌లోనూ ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ ఆర్టీసీ వర్క్‌షాప్ ఆవరణలో మహిళలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పుట్ట వద్ద పాలు పోసి నైవేద్యాలు సమర్పించారు.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. పట్టణంలోని నాగేంద్రుని పుట్ట వద్ద భక్తులు పంచమి పూజలు ఘనంగా నిర్వహించారు. వరంగల్, హన్మకొండలో ఉదయం నుంచే మహిళలు పూజలు ప్రారంభించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భక్తి శ్రద్ధలతో మహిళలు పుట్టల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలో నాగుల పంచమి వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ప్రసిద్ధ నాగోబా క్షేత్రం సన్నిధానంలో ఆదివాసీలు సంప్రదాయ పూజలు నిర్వహించారు. హైదరాబాద్ నాంపల్లి, సైదాబాద్‌లో ఉన్న నాగదేవత ఆలయానికి భక్తులు పోటేత్తారు.
యాదాద్రి ఆలయానికి వెళ్లే దారిలో గల పుట్టకు భక్తులు పాలు పోసి పూజలు నిర్వహించారు. యాదాద్రిలో నాగులపంచమి సందర్భంగా మహిళలలు పెద్ద సంఖ్యలో నాగదేవత పాముల పుట్టలకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికులు.. శ్రావణమాసం నాగులపంచమి పర్వదినం సందర్భంగా మహిళలు అడవులు, గ్రామాల్లో కొలువైన పాముపుట్టలను పసుపు, కుంకుమతో అందంగా అలంకరించి పూల మాలలు, పండ్లు, తులసి మాలలు వేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం పుట్టలో నాగదేవతకు కోడిగుడ్లు పాలుపోసి మహిళలు తమ కోర్కెలు కోరుకున్నారు.
ఇదీ చూడండి: 'కార్గిల్' విజయ గర్వానికి 21 ఏళ్లు