పంట కొనుగోలు కేంద్రాలను వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. నెలాఖరు వరకు పంట కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం మొదట నిర్ణయించింది. అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జూన్ ఎనిమిదో తేదీ వరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
వర్షాలు రాకముందే రైతులు తమ పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన అమ్ముకోవాలని కేసీఆర్ కోరారు. లాక్డౌన్ నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా 7 వేలకు పైగా ధాాన్యం కొనగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
90 శాతం పూర్తి..
రాష్ట్రంలో ఇప్పటికే 90 శాతం ధాన్యం కొనుగోలు పూర్తైనట్లు పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 15 జిల్లాల్లో 95 శాతానికి పైగా ధాన్యం కొనుగోళ్లు చేసినట్లు ప్రకటించారు. ఈ నెల 29 వరకు పౌరసరఫరాల సంస్థ 57.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, 6,398 కేంద్రాలకు గానూ 3,048 కేంద్రాలను మూసివేశామని అన్నారు. జూన్ 8 వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్