ఒకరు బీకాం ట్యాక్సేషన్ పట్టభద్రుడు..
మరొకరు బీఎస్సీ గణాంక శాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశారు..
ఇంకొకరు ఓ ప్రముఖ వ్యాపార సంస్థలో సూపర్‌వైజర్..
మరొకరు పదో తరగతితో చదువు ఆపేసి ఆటో డ్రైవర్‌గా ఉపాధి పొందుతున్న వ్యక్తి...
వీళ్లే ఇప్పుడు హైదరాబాద్‌లో కొవిడ్ రోగుల మృతదేహాలకు అంత్య సంస్కారాలు జరిపిస్తోంది. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వీళ్లలో కొందరు వేర్వేరు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ, ఒకరు హోటల్లో వంటవాడిగా(చెఫ్), మరొకరు ఓ సంస్థలో లెక్కలు రాస్తూ ఉపాధి పొందారు. వారి జీవితాలను కరోనా తలకిందులు చేసింది. ఉన్న ఉపాధి పోగొట్టింది. ఆకలి బాధ ఒకవైపు.. కుటుంబ సభ్యుల బాగోగులు చూడాల్సిన బాధ్యతలు మరోవైపు. ఇప్పుడేం చేయాలి? బతుకు బండిని ఎలా నెట్టుకురావాలి? కొన్ని నెలలపాటు సాగిన సంఘర్షణ..కాటికాపరులుగా పనిచేసైనా కడుపు నింపుకోవాలన్న నిర్ణయానికి వచ్చేలా వారిని పురిగొల్పింది.
ఆకలికేం తెలుసు ఆపదని..
నగరంలో దాదాపు 20 శ్మశాన వాటికల్లో కొవిడ్ మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈఎస్‌ఐ హిందూ శ్మశానవాటికలో ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి. ఒక్కోచోట 10-12 మంది కూలీలు బయట నుంచి వచ్చి పనిచేస్తున్నారు. వీరిలో సగం మంది గతంలో వివిధ ప్రైవేటు సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసినవాళ్లే. లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు పోవడంతో ఏ పనీదొరక్క శ్మశానాల్లో కూలీలుగా పనికి కుదిరారు. ఇక్కడ అధికారిక సిబ్బంది కరోనా భయంతో మృతదేహాల సమీపంలోకి వెళ్లేందుకు వెనకడుగు వేస్తూ వీరి సేవలను వినియోగించుకుంటున్నట్టు తెలిసింది. ‘ఒక్కో దహనానికి రూ.500-1000 దాకా ఇస్తున్నారు. మృతదేహాన్ని అంబులెన్సు నుంచి దించడం, అంత్యక్రియలు పూర్తిచేయడం మా పని. ఆపదని తెలిసినా పనిచేయక తప్పట్లేదు’ అని వాళ్లు ‘ఈనాడు’ ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. కొందరు మాస్కులూ ధరించకుండా దహన క్రియల్లో పాల్గొనడం కన్పించింది.
ఆన్‌లైన్‌లో ఆఖరి చూపులు
కరోనా అయినోళ్ల అంత్యక్రియలను ఆన్‌లైన్‌లో చూడాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కొవిడ్ మృతుల అంత్యక్రియలకు బంధువులను అనుమతించడంలేదు. ఆసుపత్రుల నుంచి నేరుగా శ్మశానాలకు తరలిస్తుండటంతో బంధువులకు కనీసం ఆఖరి చూపులూ దక్కడం లేదు. శ్మశానానికి వచ్చే ఒకరిద్దరు కుటుంబ సభ్యులు..అంత్యక్రియల దృశ్యాలను వీడియో కాల్, లేదా గ్రూప్ కాలింగ్‌లతో బంధువులకు చూపిస్తూ రోదిస్తున్నారు.