ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టం కట్టాలంటూ మహబూబాబాద్‌లో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు ప్రచారం నిర్వహించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ యాదాద్రి జిల్లా మోత్కూరులో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు మద్దతు తెలిపారు. పట్టభద్రులంతా పల్లా విజయానికి సహకరించాలని విజ్ఞప్తిచేశారు.
పీఆర్సీ భిక్ష కాదు
కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ... ఆ పార్టీ ప్రచారరథాన్ని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని ఖమ్మం జిల్లా మధిరలో ప్రారంభించారు. రాములు నాయక్ విజయం సాధించాలంటూ ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కుట్ర చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. పీఆర్సీ కేసీఆర్ ఇచ్చే భిక్ష కాదని... ఉద్యోగుల హక్కని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో ఎన్నికలు ఉండగా ఇప్పుడు బోగస్ ఓట్లపై ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
గెలిపిస్తే పరిష్కరిస్తాం
తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్.రమణకు పలు బీసీ సంఘాల నేతలు మద్దతు పలికారు. అగ్రవర్ణ అహంకారానికి బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం మధ్య జరుగుతున్న పోరుగా రమణ అభివర్ణించారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ జిల్లాల స్వతంత్ర అభ్యర్థి అబ్దుల్ బాసిత్ హామీ ఇచ్చారు. యువత ఉద్యోగాలు రాక తీవ్ర మనస్తాపంతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు