చైతన్యవంతమైన ప్రజల భాగస్వామ్యంతోనే కరోనా మహమ్మారి మరింత ప్రబలకుండా చూడగలమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. ప్రజల సహకారంతోనే కొవిడ్ సంక్షోభం నుంచి బయటపడవచ్చని గవర్నర్ సూచించారు. సంక్షోభ సమయంలో అపూర్వమైన సేవా, సహాయ కార్యక్రమాలు చేస్తున్న రెడ్‌క్రాస్ సొసైటీని అభినందించిన తమిళిసై... మరింతగా కృషి చేయాలని కోరారు. ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర, జిల్లా ప్రతినిధులతో పుదుచ్చేరి నుంచి వర్చువల్ విధానంలో గవర్నర్ సమావేశమయ్యారు.
కొవిడ్ నిబంధనలు పాటించేలా ప్రజలను చైతన్యవంతం చేయడం.. నివారణలో అత్యంత కీలకమని గవర్నర్ తెలిపారు. ప్రజలు నివారణ పద్ధతులను సరిగ్గా అనుసరించినప్పుడే సంక్షోభం నుంచి బయట పడవచ్చని అభిప్రాయపడ్డారు. కొవిడ్ రెండో దశ తీవ్రంగా ఉన్నందున మరింత ఎక్కువ మంది వాలంటీర్లతో సేవా కార్యక్రమాలు ఉద్ధృతంగా చేపట్టి నిస్సహాయులకు అండగా నిలవాలని తమిళిసై పిలుపునిచ్చారు.
కొవిడ్ నివారణ నిబంధనలు పాటించడమే కాకుండా... అందరూ టీకాలు తీసుకోవటం అందరి తక్షణ కర్తవ్యమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ గొప్ప సంకల్పంతో, సమష్టిగా, మొక్కవోని దీక్షతో, సమన్వయంతో చైతన్య కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టినప్పుడే ఈ గడ్డు కాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలమని గవర్నర్ అభిప్రాయపడ్డారు.