ప్రజలకు ఉపాధి కల్పించడంలో వాణిజ్య, పరిశ్రమలదే కీలక పాత్రని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రభుత్వం సకాలంలో లాక్‌డౌన్ ప్రకటించి ఎన్నో విలువైన ప్రాణాలు కాపాడారని పేర్కొన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుందని తెలిపారు. కొవిడ్ నివారణలో ప్రభుత్వాల వ్యూహాత్మక చర్యలు అనే అంశంపై ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ అండ్ కామర్స్ నిర్వహించిన సదస్సులో దృశ్యమాధ్యమం ద్వారా గవర్నర్ ప్రసంగించారు.
మన దేశం కూడా పీపీఈ కిట్లు, మాస్కుల కొరతను ఎదుర్కొందని... ప్రభుత్వాల సమర్థ చర్యలతో రోజుకు 5 లక్షల పీపీఈ కిట్ల తయారీ సామర్థ్యాన్ని సాధించిందని తమిళిసై అన్నారు. వెంటిలేటర్లు, టెస్టింగ్, పీపీఈ కిట్లు, ప్రాణాధార ఔషధాలు ఎగుమతి చేస్తోందని గవర్నర్ తెలిపారు. భౌతిక దూరం, మాస్కులు ధరించడం ద్వారా కొవిడ్‌ను నివారించొచ్చని సూచించారు. త్వరలోనే దేశంలో రోజుకు 10 లక్షల కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు.
ఇదీ చదవండి: ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు మేలు : కేటీఆర్