ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. మూడు వారాల క్రితం గవర్నర్ వద్దకు ఏపీ ప్రభుత్వం బిల్లులు పంపింది. బిల్లులపై న్యాయశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపిన ఏపీ గవర్నర్.. ఆమోద ముద్ర వేశారు. గవర్నర్ ఆమోదంతో శాసన ప్రక్రియ పూర్తయిందని ఏపీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
జూన్ 16న ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. బిల్లులపై ఏపీ మండలిలో ఎలాంటి చర్చ జరగకుండానే నిరవధిక వాయిదా పడింది. ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై ఆ రాష్ట్ర హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి.