కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం, చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు కానున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి సమావేశంలో ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో తుది నిర్ణయం తీసుకోనున్నారు. విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు సమావేశమై వర్సిటీల నుంచి తెప్పించుకున్న నివేదికలను పరిశీలించారు. గవర్నర్ తమిళిసై కూడా పరీక్షల రద్దు గురించి పలు సంఘాలు నుంచి అందిన వినతి పత్రాలను ప్రభుత్వానికి పంపారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సులు నడపడం లేదు. దీనికి తోడు అధిక శాతం మంది విద్యార్థులు సొంత ఊళ్లకు వెళ్లడం వంటి అంశాలు పరిగణలోకి తీసుకొని... చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. పరీక్షలు రద్దు చేసిన సమయంలో అంతర్గత మార్కులు, ఇతర అంశాలకు వెయిటేజీ ఇచ్చి గ్రేడ్లు ఇచ్చారో... ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు ఏం చేశాయో తెలుసుకోవాలని మంత్రి, సీఎస్ అధికారులను ఆదేశించారు. బ్యాక్‌లాగ్ సబ్జెక్టులున్న వారికి మార్కులు పెంచుకోవాలన్న వారికి తర్వాత పరీక్షలు నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. ఇంజినీరింగ్‌లో కొత్త విద్యార్ధులకు సెప్టెంబరు మొదటి వారంలో పాత వారికి ఆగస్టు 15 తర్వాత తరగతులు నిర్వహించాలని భావిస్తున్నారు. సిలబస్ పూర్తయ్యే పరిస్థితి లేకుంటే రెండో శనివారాలు తరగతులు నిర్వహించడం, ఒక గంట అదనంగా బోధన జరపాలనే సూచనలు వచ్చాయి.
ఇదీ చూడండి: సెలవిక: బరువెక్కిన జన హృదయం.. అడుగడుగునా పూలవర్షం