Btech self finance courses fees : అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గత రెండేళ్ల నుంచి ఐటీ రంగంలో డిమాండ్ ఉన్న పలు కోర్సులకు అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ కళాశాలలు ఆ అవకాశాన్ని వినియోగించుకొని పెద్ద ఎత్తున కృత్రిమ మేధ, ఏఐ అండ్ ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ తదితర కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి.
ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓయూలో సైతం గత ఏడాది బీటెక్‌లో ఏఐ అండ్ ఎంఎల్ కోర్సును అందుబాటులోకి తెచ్చారు. ఫీజును రూ.1.20 లక్షలుగా నిర్ణయించారు. ఈసారి జేఎన్‌టీయూ హైదరాబాద్‌తోపాటు సుల్తాన్‌పూర్ ప్రాంగణంలో బీటెక్ ఏఐ అండ్ ఎంఎల్, డేటా సైన్స్ కోర్సుల్లో ఏదో ఒకటి ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఫీజు ఇంకా నిర్ణయించలేదని, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. మరో ఉన్నతాధికారి మాత్రం రూ.లక్ష ఫీజును నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ కళాశాలల్లో ఈ కోర్సులకు ఇప్పటివరకు అత్యధికంగా రూ.1.34 లక్షల ఫీజు ఉంది. ఈసారి 20-25 శాతం పెరిగే అవకాశం ఉంది.
కొత్తగా రెగ్యులర్ కోర్సులు లేనట్లే.. కొత్తగా వచ్చే ప్రాంగణాల్లో మినహా ఇప్పటికే ఉన్న జేఎన్‌టీయూ హైదరాబాద్, సుల్తాన్‌పూర్, జగిత్యాల, మంథని క్యాంపస్‌లతోపాటు ఓయూ, మహాత్మాగాంధీ వర్సిటీల్లో కొత్తగా రెగ్యులర్ కోర్సులు వచ్చే సూచనలు కనిపించడం లేదు. ప్రభుత్వ అనుమతితో ప్రవేశపెట్టే కోర్సులను రెగ్యులర్‌గా పిలుస్తారు. ఆ కోర్సుకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, ఇతర నిర్వహణ ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. ఆ కోర్సులకు రూ.30-35 వేల వరకు ఫీజు ఉంది. వర్సిటీలు సొంతగా ప్రవేశపెట్టాలనుకునే కోర్సులకు ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వనందున సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా అందుబాటులోకి తెస్తున్నాయి. అందుకు అవసరమైన నిధులను భారీ ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచే వసూలు చేస్తున్నాయి.