ఇవాళ జరగనున్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో బలమైన వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధానంగా కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 50 శాతం నీటిని కేటాయించాలని కోరనుంది. తెలంగాణకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని.. రాష్ట్రానికి పూర్తిస్థాయి వాటా చేసే వరకు సగం కేటాయింపులు చేయాలని వాదనలు వినిపించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. అందుకు అవసరమైన వివరాలు, సమాచారాన్ని అధికారులు ఈ సమావేశం ముందు ఉంచనున్నారు.
జలవిద్యుత్ అవసరాలపై వాదన..
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా జలవిద్యుత్ ఉత్పత్తి ఆవశ్యకతను సమావేశంలో వివరించనున్నారు. వంద శాతం జల విద్యుత్ ఉత్పత్తి చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కేఆర్ఎంబీ, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీంతో తెలంగాణ విద్యుత్ అవసరాలు, జలవిద్యుత్ ఉత్పత్తి ఆవశ్యకతపై అధికారులు వాదనలు వినిపించనున్నారు.
తాగునీటి కేటాయింపులపై..
పట్టిసీమ, పోలవరం ద్వారా .. గోదావరి జలాలను కృష్ణాకు ఏపీ తరలిస్తున్నందున.. రాష్ట్రానికి 45 టీఎంసీలు అదనంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతోంది. ఒక నీటి సంవత్సరంలో కేటాయించిన జలాల్లో మిగులు ఉంటే మరుసటి ఏడాది వినియోగించుకునేందుకు అనుమతించాలని... తాగునీటి కోసం తీసుకున్న జలాలను 20 శాతంగానే లెక్కించాలని ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయాలపైనా వాదనలు వినిపించనుంది.
ఏపీ ప్రాజెక్టుల ప్రస్తావన..
పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు పాతవేనని... ఉమ్మడి రాష్ట్రంలోనే వీటికి ఉత్తర్వులు జారీ అయ్యాయని మరోమారు స్పష్టం చేయనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిపై అనుమతులు లేకుండా చేపట్టిన ప్రాజెక్టులపై ఇప్పటికే ఫిర్యాదులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... కేఆర్ఎంబీ భేటీలోనూ మరోమారు ప్రస్తావించనుంది. ఏపీ సర్కార్.. కృష్ణా జలాలను బేసిన్ వెలుపలకు తరలిస్తోందని.. అలా చేయకుండా నిలువరించాలని కోరనుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ కుడి కాల్వ విస్తరణ పనులు ఆపాలని ఇప్పటికే ఫిర్యాదులు చేసింది. భేటీలో మరోమారు ఈ అంశంపై వాదనలు వినిపించనుంది.
గెజిట్‌పై ప్రభుత్వ వైఖరి వెల్లడయ్యే అవకాశం..
గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై కృష్ణా, గోదావరి బోర్డులు గతంలో నిర్వహించిన సమావేశాలకు గైర్హాజరైన తెలంగాణ అధికారులు... ఇవాళ సాయంత్రం జరగనున్న కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఉమ్మడి భేటీకి మొదటిసారి హాజరు కానున్నారు. దీంతో బోర్డుల పరిధి నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రభుత్వ వైఖరిని వెల్లడించే అవకాశం ఉంది. కొత్త రాష్ట్రమైన తెలంగాణకు నదీజలాల్లో కేటాయింపులు చేయాలని ప్రభుత్వం కోరుతోంది. ప్రాజెక్టుల వారీ కేటాయింపులు లేకుండా బోర్డుల ద్వారా నిర్వహణ ఎలా సాధ్యమని అంటోంది. దీంతో పాటు నోటిఫికేషన్‌లోని అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. చేపట్టిన అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇస్తామని, త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరే అవకాశం ఉంది.
ఇదీచూడండి: krishna Board: రేపటి కృష్ణా బోర్డు భేటీలో వాటాల లెక్క తేలేనా...?