సముద్రంలోకి వృథాగా పోతున్న ప్రాణహిత, గోదావరి జలాలను ఒడిసిపట్టి పంట పొలాల్లోకి మళ్లించే ధ్యేయంతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో పూర్తి చేసింది. ప్రాజెక్టు మొదటి లింక్‌లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నుంచి.. ఎల్లంపల్లి వరకు జలాల ఎత్తిపోతను ఇప్పటికే ప్రారంభించారు. అక్కడి నుంచి మధ్యమానేరు వరకు జలాలను విజయవంతంగా తరలించారు. ప్రస్తుతం మధ్యమానేరు శ్రీరాజరాజేశ్వర జలాశయం నీటితో కలకలలాడుతోంది. ఆ నీరు సిరిసిల్లనూ తాకుతున్నాయి. తర్వాత దశలో నీటిని ఎత్తిపోసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
బాహుబలి సర్జ్‌పూల్..
కాళేశ్వరం ప్రాజెక్టు పదో ప్యాకేజీలో భాగంగా అతిపెద్ద సర్జ్‌పూల్‌ను నిర్మించారు. మధ్యమానేరు నుంచి కాల్వలు, సొరంగ మార్గాల ద్వారా వచ్చే జలాలను ఇక్కడ నిల్వచేస్తారు. అనంతగిరి జలాశయంలోకి నీటిని తరలించేందుకు పదో ప్యాకేజీలో భాగంగా అన్నపూర్ణ పంప్ హౌజ్‌ను నిర్మించారు. సర్జ్‌పూల్‌లో నిల్వచేసిన నీటిని భారీ పంపుల ద్వారా భూగర్భం నుంచి 101 మీటర్ల పైకి ఎత్తిపోస్తారు.
30 వేల ఎకరాలకు సాగునీరు..
కొండల మధ్య అనంతగిరి రిజర్వాయర్‌ను నిర్మించారు. జలాశయం కోసం నాన్ఓవర్ ఫ్లో డ్యాం వాల్స్‌ను మట్టితో కట్టను నిర్మించారు. జలాశయ పనులన్నీ పూర్తయ్యాయి. అనంతగిరి జలాశయం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట, సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు, బెజ్జంకి మండలాలకు చెందిన 30 వేలకు పైగా ఎకరాలకు సాగునీరు అందిస్తారు.
భూగర్భ సర్జపూల్..
మధ్య మానేరు నుంచి తరలించే నీటిని అనంతగిరి జలాశయం నుంచి రంగనాయక సాగర్ పేరిట నిర్మించిన ఇమాంబాద్ జలాశయానికి మరో దశలో తరలిస్తారు. పదకొండో ప్యాకేజీలోని పంపులకు నీరందించేందుకు భూగర్భంలోనే సర్జ్‌పూల్‌ను నిర్మించారు. ఎనిమిదిన్నర కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా వచ్చిన నీటిని ఇక్కడ నిల్వ చేసి పంపులకు సరఫరా చేస్తారు.
పర్యటకానికి ఊతం..
అనంతగిరి జలాశయం నుంచి వచ్చే జలాలను ఎగువకు ఎత్తిపోసేందుకు పదకొండో ప్యాకేజీలో భాగంగా భూగర్భంలో మరో పంప్ హౌజ్ నిర్మించారు. సిద్దిపేట సమీపంలో మరో జలాశయం సిద్ధమైంది. జలాశయం చుట్టూ బీటీ రహదార్ల నిర్మాణం కూడా పూర్తైంది. సాగునీటితో పాటు పర్యాటక రంగాన్ని విస్తరించేందుకు జలశయం సమీపంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. రంగనాయక్ సాగర్ నుంచి తదుపరి దశలో నీటిని కొమురెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాలకు తరలిస్తారు.
ప్రస్తుతం మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసే వీలుంది. ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు వరకు మూడో టీఎంసీ, మధ్యమానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు రెండో టీఎంసీ ఎత్తిపోసేందుకు అవసరమైన అదనపు పనులకు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదం తెలిపింది. ఈ పనుల కోసం త్వరలోనే టెండర్లు పిలవనున్నారు.
ఇవీచూడండి: గోదావరి గలగల... కాళేశ్వరం కాలువలకు జలకళ