Govt Job Notification: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియ పూర్తైన వెంటనే సాధారణ బదిలీలు చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేటాయింపుల ప్రక్రియకు కొనసాగింపుగానే బదిలీల ప్రక్రియ కూడా చేపట్టాలని ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరాయి. సీఎం కూడా వారి విజ్ఞప్తిపై సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం..
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు... బదిలీల అంశంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుత ప్రక్రియకు కొనసాగింపుగానే బదిలీలు కూడా చేపట్టాలన్న అంశంపై సమాలోచనలు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాలతో చర్చించిన అనంతరం.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం వెలువరించనున్నారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఉద్యోగుల బదిలీల కోసం మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించనుంది.
సంక్రాంతి తర్వాత ఉద్యోగ ఖాళీల భర్తీ..
కొత్త సంవత్సరంలోపు కేటాయింపుల ప్రక్రియను పూర్తి చేసి... ఆ తర్వాత అప్పీళ్లు, దంపతుల అంశాలను పరిష్కరించనున్నారు. ఇదే సమయంలోనే ప్రత్యేక కేటగిరీల వారి విజ్ఞప్తులను కూడా పూర్తి చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత బదిలీల ప్రక్రియను చేపట్టే అవకాశం కనిపిస్తోంది. పరిస్థితులను బట్టి అవసరమైతే కొన్ని సూపర్ న్యూమరీ పోస్టులకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదంతా పూర్తి అయితే ఉద్యోగ ఖాళీలకు సంబంధించి కచ్చితమైన వివరాలతో పూర్తి స్పష్టత వస్తుందని అంటున్నారు. ఇప్పటివరకు 70 వేల వరకు ఖాళీలను గుర్తించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియ అంతా పూర్తయితే... ఖాళీల సంఖ్య ఇంకా కొంత మేర పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సంక్రాంతి తర్వాత ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఇదీచూడండి: దంపతుల బదిలీలపై మార్గదర్శకాలు ప్రకటించిన ప్రభుత్వం