Harish Rao Review on Abhaya Hastam: రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న అభయ హస్తం నిధులు ఆ మహిళలకు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి ఆయా శాఖల కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులతో శాసభసభ ప్రాంగణంలోని సమావేశపు గదిలో ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలు రూ.545 కోట్ల వరకు పొదుపు చేసుకున్నారు.
మహిళలు అడగడంతో...
అప్పట్లో అభయ హస్తం కింద రూ.500 కంట్రిబ్యూటరీ పెన్షన్ కోసం ఈ పొదుపు చేశారు. అయితే... తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పథకం కింద మొదట్లో రూ.1,000 నుంచి ఇప్పుడు రూ.2016 మొత్తం పెన్షన్‌గా ఇస్తుంది. అప్పటి కంటే ఇప్పుడు అధిక మొత్తంలో పెన్షన్ వస్తున్న దృష్ట్యా... మహిళలు సైతం అభయ హస్తం డబ్బులు తమవి తమకు కావాలని అడుగుతున్నారు.
మరో రెండు మూడు రోజుల్లోనే..
పొదుపు మహిళల కోరిక మేరకు ఆ నిధులు తిరిగి ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి వెల్లడించారు. ఈ నిధులు సంబంధిత పేదరిక నిర్మూలన సంస్థ వద్దే ఉన్నందున ఆ మొత్తం తిరిగి ఇవ్వనున్నామన్నారు. మరో రెండు మూడు రోజుల్లోనే ఆ నిధులు ఆయా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ మేరకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు.
ఇదీ చదవండి : సభలో ఒక్కసారిగా విరిసిన నవ్వులు.. పడిపడి నవ్విన కేటీఆర్.. ఎందుకంటే..?