Godavari: గోదావరి మహోగ్ర రూపంతో గట్లన్నీ గజగజ వణుకుతున్నాయి. ఏళ్లుగా ఆధునికీకరణ ఊసు లేక ప్రవాహ వేగానికి కొన్నిచోట్ల గట్లపైనుంచి వరద పొంగిపొర్లుతూనే ఉంది. ఇంకొన్ని చోట్ల కాలువ గట్లు నెర్రెలిచ్చి రంధ్రాలు పడ్డాయి. వరద తగ్గినప్పుడు ప్రవాహ వేగానికి గట్లు ఎక్కువగా కోతకు గురయ్యే ప్రమాదం ఉండడంతో యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.
తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల పరిధిలో కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలున్నాయి. ఈ పరిధిలోని 10,13,161 ఎకరాల ఆయకట్టుకు కాటన్ బ్యారేజీ నుంచి సాగునీరు అందుతోంది. కాలువల ఆధునికీకరణ లేకపోవడం, ఏటి గట్లు బలహీనపడటంతో విపత్తుల సమయంలో పరిస్థితి పట్టు తప్పుతోంది. ఏటా జూన్, జులై, ఆగస్టులలో వచ్చే విపత్తులు, వరదలతో రైతులతోపాటు లోతట్టు ప్రాంతాలవారు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది.
ఎత్తు పెంచితేనే గండం గట్టెక్కేది.. గోదావరి జిల్లాల్లో సాగు, మురుగునీటి పారుదల వ్యవస్థల్లో లోపాలున్నాయి. 1953లో 30.03 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ తర్వాత రికార్డు స్థాయిలో 1986 ఆగస్టు 16న 35.06 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ స్థాయికి తగ్గట్టు కాలువల ఎత్తు పెంపు పూర్తి స్థాయిలో కొనసాగలేదు. తాజాగా 25 లక్షల క్యూసెక్కులకే గట్లపై కొన్నిచోట్ల వరద పొంగింది. ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట నియోజకవర్గాల్లో 30చోట్ల గట్లు బలహీనంగా ఉండగా.. పశ్చిమగోదావరి జిల్లాలో 10 ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంది. కోనసీమ జిల్లావ్యాప్తంగా 19చోట్ల ఏటిగట్లు ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించారు.
ఇదీ పరిస్థితి.. గోదావరి వరద వేగానికి కాట్రేనికోన మండలం పళ్లంకుర్రు సమీపంలోని వృద్ధ గౌతమి ఏటిగట్టు బలహీనపడింది. గట్టుకు రెండడుగుల పైనుంచి వరద పొర్లడంతో ఇసుక బస్తాలనేసి గండాన్ని ఆపారు. బూలవారిమొండి సమీపంలో ఏటిగట్టు 800 మీటర్ల మేర బలహీనపడింది. 500 మీటర్ల పొడవునా గట్టుపై ఇసుక బస్తాలేశారు.
పి.గన్నవరం మండలం లంకల గన్నవరం వద్ద వశిష్ఠ ఎడమ ఏటిగట్టు 750 మీటర్ల మేర బలహీనంగా మారింది. అధికారులు, స్థానికులు రేయింబవళ్లు శ్రమించి ఇసుక బస్తాలు వేశారు. నాగుల్లంక వద్ద వైనతేయ కుడి ఏటిగట్టుకు రంధ్రం పడింది.
కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం, రావులపాలెం, పి.గన్నవరం, రాజోలు, కపిలేశ్వరపురం, కె.గంగవరం, ఐ.పోలవరం తదితర మండలాల్లో ఏటి గట్లు బలహీనంగా ఉన్నట్లు ఇప్పటికే జలవనరుల శాఖ గుర్తించింది. రక్షణ చర్యలు చేపడుతోంది.
వైనతేయ కుడి కరకట్ట పి.గన్నవరం మండలం నాగుల్లంక నుంచి మామిడికుదురు మండలం గోగన్నమఠం వరకు 28 కి.మీ.మేర విస్తరించి ఉంది. 1986లో వచ్చిన వరదలతో దీన్ని రెండు మీటర్ల మేర ఎత్తు పెంచాలని నిర్ణయించారు. 2007లో రూ.30 కోట్లు కేటాయించగా కొన్ని చోట్ల పనులు పూర్తి కాలేదు.
మామిడికుదురు మండలం పెదపట్నంలోని బాబానగర్ వద్ద ఇసుక బస్తాలు వేశారు. రత్నాపురంలో రెండుచోట్ల గట్టు నెర్రెలివ్వడంతో బస్తాలు పెట్టారు. పెదపట్నం ఆంంజనేయస్వామి ఆలయం వద్ద 15 మీటర్ల మేర గట్టు జారిపోయేలా ఉండటంతో ఇసుక బస్తాలు వేశారు. పాశర్లపూడిలోని శ్రీరామపేట, పాశర్లపూడిలంకలోని సర్పాలరేవు వద్ద దాదాపు 400 మీటర్ల మేర కరకట్ట బాగాలేదు.
మలికిపురం మండలం దిండి శ్మశానం వంతెన వద్ద వశిష్ఠ ఎడమ కరకట్ట సుమారు వంద మీటర్ల మేర ఎత్తు తక్కువగా ఉండి బలహీనంగా మారింది. అధికారులు, స్థానిక యువకులు మట్టితో పూడ్చి రక్షణ కల్పించారు.
భారీగా వరద రావడంతో పలుచోట్ల గట్ల పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని, రక్షణ చర్యలు చేపట్టామని హెడ్‌వర్క్స్ ఈఈ కాశీ విశ్వేశ్వరరావు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామన్నారు.
కాటన్ బ్యారేజీకి ఎగువన.. అఖండ గోదావరి ఏటి గట్లు: 81.80 కి.మీ.పరిధి
అంగుళూరు ఫ్లడ్‌బ్యాంకు: 1.93 కి.మీ.
కాటన్ బ్యారేజీ దిగువన.. గౌతమి ఏటి గట్లు: 204.70 కి.మీ.పరిధి
వశిష్ఠ గోదావరి గట్లు: 246.30 కి.మీ.