గ్రేటర్ హైదరాబాద్‌లో జనాలను ఇబ్బంది పెట్టే అది పెద్ద సమస్య వాహనాల పార్కింగ్. సరదాగా హోటల్‌కు వెళ్లి బోజనం చేద్దామన్నా... అలా షాపింగ్ చేయ్యాలన్నా.. సినిమాకు వెళ్లినా... ఏదైనా సందర్శక ప్రదేశాని చూద్దామన్నా.. ఇలా ఏ సందర్భంలోనైనా ఉత్సాహంతో వెళ్లిన ప్రతీ వాహనదారుడు నిరుత్సాహపడాల్సిందే. బైక్ అయినా.. కారైనా.. ఏది తీసుకెళ్లినా దాన్ని పార్క్ చేసేందుకు మాత్రం స్థలం దొరకదు. పెద్ద వాణిజ్య సముదాయాల్లో సైతం పార్కింగ్ స్థలం లేక ఇబ్బందులు తప్పవు. ఎక్కడైనా అందుబాటులో కొంచెం ఖాళీ స్థలం కనిపించి పార్కింగ్ చేస్తే... పోలీసులు జరిమానాలంటూ మోత మోగిస్తుంటారు.
జంటనగరాల్లో స్మార్ట్ పార్కింగ్...
ఇకపై నగరవాసులకు ఇలాంటి బాధల నుంచి ఉపశమనం కలిగించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటోంది. జంట నగరాల్లో స్మార్ట్ పార్కింగ్ విధానాన్ని తీసుకొస్తోంది. నగరంలో ఇటీవల ఎస్సార్డీపీలో భాగంగా పలు ఫ్లైఓవర్లు నిర్మించారు. వీటి కింద ఉన్న స్థలాన్ని పార్కింగ్ కోసం వాడుకోవాలని బల్దియా నిర్ణయించింది. ఫ్లై ఓవర్ల కింద గ్రీనరీతో పాటు... పార్కింగ్ సదుపాయాన్ని కూడా జీహెచ్ఎంసీ కల్పిస్తోంది. మొదటగా కూకట్పల్లి సుజనా ఫోరం మాల్ ముందు ఉన్న ఫ్లైఓవర్ కింద ఈ స్మార్ట్ పార్కింగ్ విధానాన్ని తీసుకోస్తోంది. పీపీపీ విధానంలో ఈ స్మార్ట్ పార్కింగ్ విధానాన్ని బల్దియా ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ ఒకేసారి 20 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. త్వరలోనే ఈ విధానం అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.
30 నిమిషాలు ఫ్రీనే... ఆ తర్వాత...
ఈ పార్కింగ్ ప్రదేశంలో మార్కింగ్లు ఏర్పాటు చేశారు. నిర్ణీత ప్రదేశంలోనే పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. వాహనం వచ్చి వెళ్లేటప్పుడు స్కానింగ్ చేసి ఆటోమిటిక్‌గా బిల్లింగ్ వేస్తారు. ఆన్‌లైన్‌తో పాటు.. ఆఫ్‌లైన్‌లో కూడా పార్కింగ్ ఫీజు చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. ఒక్కసారి పార్కింగ్ చేసిన వాహనానికి సంబంధించిన వివరాలను అధికారులు ఏడాది వరకు స్టోర్ చేయనున్నారు. ఇక్కడ 30 నిమిషాల వరకు ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చు. తర్వాత గంటకు 5 రూపాయలు, 3 గంటలకు 15 , 6 గంటలకు 25 , 12 గంటకు 50 , 24 గంటకు 100 , నెల రోజుల పాస్‌కు 1500 రూపాయల ధరను నిర్ణయించారు.
జీహెచ్ఎంసీకి ఆదాయం..
కూకట్పల్లి తర్వాత... జంట నగరాల్లో అవకాశం ఉన్న పలు ఫ్లైఓవర్ల కింద దశల వారీగా స్మార్ట్ పార్కింగ్ సౌకర్యం కల్పించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు యోచిస్తున్నారు. రానున్న రోజుల్లో నాలుగు చక్రాల వాహనాలకు కూడా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ విధానంతో నగరంలో పార్కింగ్ ఇబ్బందులకు చెక్ పెట్టటమే కాకుండా... జీహెచ్ఎంసీకి అదనపు ఆదాయం సమకూరనుంది.
ఇవీ చూడండి: