హైదరాబాద్ నగరంలో వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తం అయింది. గ్రేటర్ హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో 610 శిథిల భవనాలు ఉన్నాయని పట్టణ ప్రణాళిక విభాగం గుర్తించింది. ఈ సంవత్సరం జూన్ 26వ తేదీ నుంచి ప్రారంభించిన స్పెషల్ డ్రైవ్ లో ఇప్పటి వరకు 175 శిథిల భవనాలను కూల్చివేయగా.. మరో 84 భవనాలకు మరమ్మతులు చేశారు. 2020లో 231 శిథిల భవనాలను కూల్చివేయగా.. 129 భవనాలకు మరమ్మతులు చేసింది. వర్షాకాలంలో విపత్తుల నివారణలో భాగంగా శిథిల భవనాలను గుర్తించడం, పురాతన భవనాల పటిష్టత, భద్రతపై ఇంజనీరింగ్ విభాగాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం, అత్యంత ప్రమాదకరమైన భవనాలను కూల్చివేసేందుకు టౌన్ ప్లానింగ్ విభాగం ఈ కార్యాచరణను చేపట్టింది.
నివాసితులకు కౌన్సిలింగ్
ఈ శిథిల ప్రమాదకరమైన భవనాల్లో ఉన్న నివాసితులు ఖాళీ చేయడానికి నిరాకరిస్తుండడంతో వారికి జీహెచ్ఎంసీ అధికారులు కౌన్సిలింగ్ చేపడుతున్నారు. అదేవిధంగా అత్యంత ప్రమాదకరంగా ఉన్న భవనాల సమీపంలోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు ఆయా భవనాల చుట్టూ భారీ కేడ్లను అమర్చారు. ప్రమాదకరంగా ఉన్న శిథిల భవనాలు వర్షాల వల్ల కూలి ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉన్నందున ఈ భవనాల పరిసర ప్రాంతాల్లో ఉన్న నివాసితులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు హెచ్చరించారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేత
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2017 సంవత్సరంలో 199 శిథిల భవనాలను కూల్చివేయగా.. 15 భవనాలను జీహెచ్ఎంసీ సీజ్ చేసింది. 2018లో 182 శిథిల భవనాలను కూల్చివేయగా.. 26 భవనాలను సీజ్ చేశారు. వీటితో పాటు 2019 జనవరి నుంచి జూన్ 11వ తేదీ వరకు 382 అనధికార భవన నిర్మాణాలను కూల్చివేయగా.. 129 ప్రాంతాల్లో ఆక్రమణలను కూల్చివేశారు. 2017లో 373 అక్రమ నిర్మాణాలను, 227 ప్రాంతాల్లో రహదారులపై ఆక్రమణలను కూల్చివేశారు. 2018లో 554 అక్రమ నిర్మాణాలను కూల్చివేయగా.. రహదారులు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను కూల్చివేసింది.
ఇదీ చదవండి: Dalit Bandhu : దళిత బంధు పథకం దరఖాస్తుకు ప్రత్యేక యాప్