పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బల్దియా ఎన్నికల్లో హైదరాబాద్ ఓటర్లు తీర్పును బ్యాలెట్‌బాక్సులో నిక్షిప్తం చేశారు. 46.6 శాతం పోలింగ్ నమోదైనట్టు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్‌కుమార్ తెలిపారు. 150 డివిజన్లకు గాను... 1,122 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తెరాస అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా.. భాజపా అభ్యర్థులు 149 చోట్ల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ 146, తెదేపా 106, మజ్లిస్ 51 డివిజన్లలో అభ్యర్థులను బరిలో దింపాయి. మొత్తం 9,101 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగగా... ఈ నెల 4న జరిగే లెక్కింపులో 1,122 మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.
3 తర్వాత పుంజుకుంది..
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్ తొలి నుంచి మందకొడిగా కొనసాగింది. ఏదో కొన్ని డివిజన్లు మినహాయిస్తే... ఓటు వేసేందుకు జనం పెద్దగా ఆసక్తికనబర్చలేదు. ఉదయం 9 గంటల వరకు 3.96 శాతం పోలింగ్ నమోదైంది. ఏ పోలింగ్ బూత్‌ల్లోనూ ఓటర్ల సందడిగా పెద్దగా కనిపించలేదు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 18.22 శాతం పోలింగ్ నమోదు కాగా... 14 డివిజన్లలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 5 శాతం కంటే తక్కువ పోలింగ్ నమోదైంది. కేవలం 10డివిజన్లలో మాత్రమే ఒంటి గంట వరకు 40 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు అమీర్ పేట, తలాబ్ చంచలం డివిజన్లలలో కనీసం ఒక్కశాతం పోలింగ్ కూడా నమోదు కాలేదు. సాయంత్రం 3 వరకు 25.34 శాతం పోలింగ్ నమోదైంది. అప్పటి నుంచి ఓటింగ్ కాస్తా పుంజుకుంది.
ఓట్ల గల్లంతు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓటేసిన యువతీ యువకులంతా గ్రేటర్ ఎన్నికల్లోనూ వినియోగించుకున్నారు. 65 ఏళ్లకు పైబడిన వృద్ధులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. సికింద్రాబాద్ జోన్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో అటు యువతీయువకులు ఇటు వృద్ధులు ఓటు వేసి ఓటరు బాధ్యతలను గుర్తు చేశారు. ఈ సారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు గల్లంతయ్యాయని పలుచోట్ల ఓటర్లు ఆందోళన చేపట్టారు. జియాగూడలోని బూత్ నంబర్ 36, 37, 38లో సుమారు మూడు వేల ఓట్లు గల్లంతయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీ చాంద్రాయణగుట్ట ఇంద్రానగర్‌లో ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్‌లో కేటాయించారని వాపోయారు.
నిరంతర పరిశీలన
ఎన్నికల సరళిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిరంతరం పరిశీలించింది. కార్యాలయం నుంచే అధికారులు వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. మొత్తం 2,272 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. సున్నిత, అతి సున్నిత ప్రాంతాలపై దృష్టిసారించిన అధికారులు... వీడియో రికార్డింగ్ కూడా చేయించారు. ఓటరు గుర్తింపు కోసం డివిజన్‌కు ఒకటి చొప్పున 150 పోలింగ్ కేంద్రాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. మొబైల్ యాప్ ద్వారా ఫేసియల్ రికగ్నైజేషన్ విధానంలో ఓటర్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు.
పకడ్బందీగా..
పోలింగ్ కోసం పోలీసులు పకడ్బందీగా బందోబస్తు చర్యలు చేపట్టారు. మూడు కమిషనరేట్ల పరిధిలో కలిపి 51,500 మంది సిబ్బందితో... బందోబస్తు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలను సాధారణ, సమస్యాత్మక, అతిసమస్యాత్మకంగా విభజించిన అధికారులు ఒక్కో జీహెచ్ఎంసీ సర్కిల్లో భద్రతా ఏర్పాట్ల బాధ్యతలను ఒక్కో ఏసీపీకి అప్పజెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద మౌంటెడ్ వాహనాలతో... కమాండ్ కంట్రోల్ రూమ్‌లకు అనుసంధానం చేశారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు ఆయా కమిషనరేట్ పరిధిలోని పోలీంగ్ సరళిని ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షించారు.
కొవిడ్ నిబంధనలతో..
కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక రక్షణలు తీసుకుంది. పోలింగ్ బూత్‌లలో శానిటైజర్‌లను అందుబాటులో ఉంచారు. మాస్క్‌లు లేని వారికి మాస్క్ అందించి శానిటైజ్ ఇచ్చారు. వృద్దులు, దివ్యాంగులకు కోసం వీల్ చైర్లు ఏర్పాటు చేయడంతోపాటు వారికి సహాయకులను ఉంచారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కరోనా బాధితులు నేరుగా ఓటేసేందుకు అనుమతి ఇచ్చారు.
ఇదీ చూడండి: బల్దియా పోరు: ఓటర్లలో అదే నిర్లిప్తత... కారణాలు అవేనా?