హైదరాబాద్‌లో వానలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులను త్వరగా పూర్తి చేయాలని మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ మెట్రో రైలు, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అధికారులు కూడా తమ పరిధిలోని రోడ్లకు యుద్ధ ప్రాతిపదికపై మరమ్మతులను చేపట్టాలని కోరారు.
వాన ఆగితే.. పూర్తవుతుంది
నగరంలో దెబ్బతిన్న రోడ్లను మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దానకిషోర్, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. రోడ్లపై ఏర్పడ్డ నాలుగు వేలకు పైగా గుంతలను జీహెచ్ఎంసీ వర్షకాల ఎమర్జెన్సీ బృందాలు పూడ్చివేస్తున్నాయని... వర్షం ఆగిపోతే ఈ రోడ్ల గుంతల పూడ్చివేత కార్యక్రమం ఈరోజు పూర్తవుతుందని మేయర్ స్పష్టం చేశారు. .
ప్రతి జోన్, సర్కిళ్లకు ఓ అధికారి
రోడ్ల మరమ్మతులను త్వరగా పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ సీనియర్ అధికారులను ప్రతి జోన్, సర్కిళ్లకు ప్రత్యేక అధికారులుగా నియమించామని కమిషనర్ దానకిషోర్ తెలిపారు. షల్మాక్ మిశ్రమంతో పాటు జెట్ ప్యాక్ యంత్రాలతో రోడ్లపై గుంతల పూడ్చివేత కార్యక్రమం జరుగుతోందన్నారు. ఫ్లై ఓవర్ల వద్ద దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మెట్రో మార్గాల్లో రోడ్ల పునరుద్ధరణ
సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ వరకు మెట్రో రైలు మార్గంతో పాటు ఇతర మెట్రో రైలు మార్గాల్లో రోడ్ల పునరుద్ధరణకు ప్రాధాన్యతనిస్తున్నామని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు.
త్వరలోనే పూర్తి చేస్తాం
భాగ్యనగరంలోని పలు రహదారులను పరిశీలించిన అధికారులు సిబ్బందికి తగు సూచనలు చేశారు. రహదారుల వెంట ఉన్న నిర్మాణ వ్యర్థాలు, స్టార్మ్ వాటర్ డ్రెయిన్లలో ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించాలని సూచించారు. యుద్ధప్రాతిపదికన దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు.