కరోనా వేళ జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ప్రజలకు మందుల కొరత రాకుండా అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. నిత్యం స్థానిక పీహెచ్‌సీలు ఇచ్చే బాధితుల జాబితా ఆధారంగా ఆశా కార్యకర్తలు, బల్దియా పారిశుద్ధ్య సిబ్బంది.. బస్తీలు, కాలనీలు, అపార్ట్‌మెంట్లలో పర్యటించి బాధితులకు సూచనలు ఇస్తున్నారు.
ఇప్పటికే 1000 కిట్లు: గ్రేటర్‌లో 6 జోన్లు, 30 సర్కిళ్లున్నాయి. ఒక్కో సర్కిల్‌కు ఇప్పటికే 1000 కిట్లు అందజేసినట్లు కేంద్ర కార్యాలయం తెలిపింది. ఇంటింటి సర్వేకి వెళ్లినప్పుడు.. మందులు అందలేదని కరోనా బాధితులు తెలిపితే, కిట్లు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
జ్వరం తగ్గకుంటే.. ఐదు రోజుల పాటు జ్వరం తగ్గకపోతే మిథైల్‌ప్రెడ్‌నిసొలోన్(స్టెరాయిడ్) మాత్రలు తీసుకోవాలి. 8 మి.గ్రా. రెండు మాత్రలను 5 రోజులపాటు ఉదయం, రాత్రి వేసుకోవాలి. తరచూ శరీర ఉష్ణోగ్రతను పరీక్షించుకోవాలి. రోజుకోసారి 6 నిమిషాలు నడవాలని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వైద్యుణ్ని సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ సూచించింది.
నిరంతరాయంగా కంట్రోల్‌రూం సేవలు
జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంనకు బాధితులు ఫోన్ చేయాలని, వైద్య సలహాలు, ఇతరత్రా సమాచారం ఇచ్చేందుకు అధికారులు 24 గంటల పాటు విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపింది. సాయం కావాల్సిన వారు 040-2111 1111 నంబరును సంప్రదించాలి.
కిట్లలోని మందులు.. వినియోగం ఇలా..
* డొక్షిసైక్లిన్ (యాంటీ బయాటిక్, యాంటీ వైరల్)- ఐదు రోజుల పాటు ఉదయం, రాత్రి
* పారాసిటమాల్(జ్వరం)- పది రోజుల పాటు ఉదయం, రాత్రి
* లెవొసిట్రజన్(జలుబు)- పది రోజుల పాటు ఉదయం
* ర్యాన్‌టెక్(అసిడిటీ)- పది రోజుల పాటు ఉదయం
* విటమిన్ సి(రోగనిరోధక శక్తికి)- పది రోజుల పాటు ఉదయం, రాత్రి
* మల్టీవిటమిన్(రోగ నిరోధక శక్తికి)- పది రోజుల పాటు ఉదయం, రాత్రి
* విటమిన్ డి(రోగనిరోధకశక్తికి)- పది రోజుల పాటు ఉదయం
ఇదీ చూడండి: కొవిడ్‌తో తల్లిదండ్రులు.. గుండెపోటుతో కుమారుడు