Ganesh Chaturthi 2022: గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందడి జోరందుకుంది. కొవిడ్ వల్ల రెండేళ్లుగా వేడుకల్ని అంతంత మాత్రమే చేసుకున్న ప్రజలు.. ఈసారి రెట్టింపు ఉత్సాహంతో ఉత్సవాలను జరిపేందుకు సన్నద్ధమయ్యారు. నిర్వహకులు మండపాలు సిద్ధం చేశారు. పీఓపీ విగ్రహాలతో కలిగే ముప్పుపై ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కల్పించిన అవగాహనతో... చాలామంది మట్టి గణపతులను ప్రతిష్టించేందుకు ముందుకొస్తున్నారు. ఓరుగల్లులో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు దీటుగా... 18 అడుగుల ఎత్తువరకూ మట్టి వినాయకుల విగ్రహాలను రూపొందించారు. వరంగల్‌లో మట్టి విగ్రహల తయారీ పెరిగింది. ధర ఎక్కువైనా పర్యావరణహితమైన మట్టి వినాయకులను కొనేందుకే నిర్వాహకులు ఆసక్తి చూపిస్తున్నారు. వాహనాల్లో సందడిగా విగ్రహాలను మండపాలకు తరలిస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గణేశ్ నవరాత్రులకు భక్తులు సిద్ధమయ్యారు. తయారీ కేంద్రాల వద్ద ఉత్సవ కమిటీల రద్దీ మొదలైంది. కాలుష్యం పెరుగుతోందని అవగాహన కల్పిస్తున్నా... భారీ విగ్రహాలు పెట్టాలనునేవారు పీఓపీతో తయారు చేసిన వాటి వైపే మొగ్గుతున్నారు. గతంలో పోలిస్తే వీటి ధరలు ఎక్కువగా ఉన్నాయని మండపాల నిర్వాహకులు చెబుతున్నారు.
ఇళ్లలో పూజించేందుకు మాత్రం మట్టి గణేశులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నిజామాబాద్‌లో స్వచ్ఛంద సంస్థలు, ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేశాయి. నిర్మల్‌లో గణేశ్ చతుర్థి కోలాహాలం మొదలైంది. విభిన్న రూపాల్లో ఉన్న గణేశ్ విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. హనుమకొండలో చిన్నారులు తమ చిట్టి చేతులతో మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి ఆకట్టుకున్నారు. సుమారు 500ల వినాయక విగ్రహాలను తయారు చేశారు. పర్యావరణంపై అవగాహన కల్పించడం కోసం విద్యార్థులతో తయారు చేయించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పురపాలక సంఘం ఛైర్మన్ భార్గవ్ ఆధ్వర్యంలో మూడు వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. జల కాలుష్యాన్ని అడ్డుకునేందుకు అంతా సహకరించాలని కోరారు. ఖమ్మంలో మట్టి గణపతులను ప్రతిష్టించేలా నగర పాలక సంస్థ చర్యలు చేపట్టింది. నగర పాలక సంస్థ పరిధిలో 10వేల మట్టిగణపతులు పంపిణీకి మేయర్ నీరజ శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ నారాయణగూడలో కేశవ మెమోరియల్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులకు మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు కాలుష్య రహిత పర్యావరణానికి సహకరించాలని కోరారు.
ఇవీ చూడండి: